డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్)-2020 నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు వర్సిటీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీబీఎం వంటి కోర్సులో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. ప్రవేశాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు జూలై 1 నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి తరగతులు మొదలవనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో డిగ్రీ అడ్మిషన్ ప్రక్రియలో కొత్త విధానాలకు తెరతీశారు. అడ్మిషన్లకు సంబంధించిన సమాచారాన్ని విద్యార్థులు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వాట్సాప్ చాట్‌బాట్ (ఆటో రెస్పాండర్)ను ఏర్పాటు చేశామని ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాల్లో సమాచారాన్ని అందిస్తామన్నారు. విద్యార్థులకు వచ్చే సందేహాలపైనా యూట్యూబ్ వీడియోలను రూపొందించామన్నారు. తొలిసారి ఆన్లైన్ ఫిర్యాదుల విభాగాన్ని కూడా ఏర్పాటు చేశామని వివరించారు. రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులు రూ.200 చెల్లించాలని, టీవ్యాలెట్ ద్వారా ఫీజు చెల్లించే విద్యార్థులకు చార్జీలు ఉండవని వెల్లడించారు. దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ కోసం దాదాపు 60 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పూర్తి వివరాలకు https://dost.cgg.gov. in అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని పాపిరెడ్డి పేర్కొన్నారు.
దోస్త్-2020 కీలకాంశాలు :కొత్తగా ఫేస్ రికగ్నిషన్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ సౌకర్యం తెలంగాణ ఇంటర్ బోర్డు నుంచి ఉత్తీర్ణులైన వారికి అవకాశం ఉంటుంది.
ప్రతి విద్యార్థి దోస్త్ ఐడీ నంబర్ ద్వారా ‘టీ యాప్ ఫోలియో’ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంటర్ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన రోజు తేదీ, ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
విద్యార్థులకు జారీ అయ్యే దోస్త్ ఐడీ, పిన్ నంబర్ ద్వారా దోస్త్ వెబ్‌పోర్టల్‌లోకి వెళ్లి కాలేజీలు, కోర్సులకు సంబంధించిన వెబ్ఆప్షన్లు నమోదు చేయాలి.