తెలంగాణకు హరితహారం...20 కోట్ల మొక్కలు లక్ష్యంగా.. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 17, 2020

తెలంగాణకు హరితహారం...20 కోట్ల మొక్కలు లక్ష్యంగా..

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 20.8 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మంగళవారం ప్రగతిభవన్‌లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమాన్ని కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలని, ఉద్యమస్ఫూర్తితో పచ్చదనం పెంచే కార్యక్రమం సాగాలని, కలెక్టర్లు, డీపీవోలు నాయకత్వం వహించాలని సీఎం పేర్కొన్నారు.
అడవుల పునరుద్ధరణకు, ఉన్న అడవులను కాపాడటానికి అధిక ప్రాధాన్యమివ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది హరితహారంలో భాగంగా రాష్ట్రంలో కోటి చింత మొక్కలను నాటనున్నారు. అటవీ ప్రాంతాల్లో ఫల వృక్షాలు గణనీయంగా తగ్గిపోవడంతో జనావాస ప్రాంతాలకు వస్తున్న కోతుల బెడదను అరికట్టడానికి సాధ్యమైనంతవరకు పండ్ల మొక్కలను అభివృద్ది చేయాలని నిర్ణయించారు. గ్రామ పంచాయతీలు, అటవీ ప్రాంతాలు, ఖాళీ స్థలాలు, ప్రభుత్వ ప్రదేశాల్లో వీటిని విరివిగా నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తక్కువ సమయంలో, తక్కువ విస్తీర్ణంలోనే ఏపుగా పెరిగే లక్షణం ఉన్న మియావాకి పద్ధతిలో కొండ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో చెట్లను పెంచాలి అని సీఎం పేర్కొన్నారు. ఇక మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో 4వేల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జంతువుల నుంచి మొక్కలను కాపాడేందుకు ఫైబర్‌ ట్రీ గార్డులు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. కాగా, పంచాయతీలు, పురపాలికల్లో 85 శాతం మొక్కలు బతకకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధమవుతోంది. అలాగే ప్రతి శుక్రవారం మొక్కలకు నీరుపోసేలా వాటరింగ్‌ డేను పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది.