దివ్యాంగులకు 3.5 కోట్ల నిధులు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, June 25, 2020

దివ్యాంగులకు 3.5 కోట్ల నిధులు

రాష్ట్రంలో ఉన్న దాదాపు 10 లక్షల మంది దివ్యాంగులకు సంక్షేమ పథకాలు, ఇతర అత్యవసరాల కోసం ప్రస్తుతం రూ.3.5 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధు ల సంక్షేమశాఖ కార్యదర్శి దివ్య హైకోర్టుకు విన్నవించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో దివ్యాంగులకు ఆదుకోవాలని దాఖలైన పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ విచారణకు దివ్య వీడియోకాన్ఫరెన్సింగ్‌ ద్వారా హాజరయ్యారు. దివ్యాంగుల కోసం రూ.10 కోట్లతో ప్రత్యేకనిధిని ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆమె వివరణ ఇచ్చారు. దివ్యాంగులకు ప్రభుత్వం నెలకు రూ.3,016 పింఛను అందజేస్తున్నదని, లాక్‌డౌన్‌లో రూ.1500 ఆర్థికసాయం, 12 కిలోల చొప్పున బియ్యం అందజేశామని పేర్కొన్నారు. వికలాంగులకు ఔషధాలు అందజేయడానికి ప్రతి జిల్లాకు రూ.లక్ష నిధులు అందుబాటులో ఉంచామని తెలిపారు. కేరళ తదితర రాష్ర్టాల్లో దివ్యాంగులకు కేవలం రూ.వెయ్యి మాత్రమే పింఛను ఇస్తున్నారని, తెలంగాణలో రూ.3,016 పింఛను అందుతున్నదని పేర్కొన్నారు. కరోనా సంక్షోభంలో ప్రస్తుతం ఉన్న రూ.3.5 కోట్ల అత్యవసర నిధులు సరిపోతాయ ని, అవసరమైతే ప్రభుత్వ అనుమతి తీసుకుని నిధులు మంజూరుచేస్తామని తెలిపారు. దివ్యాంగుల కోసం ఉన్న హెల్ప్‌లైన్‌ నంబర్‌కు వివిధఅవసరాలపై 1,533 కాల్స్‌ రాగా సాయం చేశామని వెల్లడించారు. తాను ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా ఉన్నప్పుడు ప్రతి 4వ శనివారం దివ్యాంగుల నుంచి విజ్ఞాపనలు తీసుకుని సమస్యల పరిష్కారానికి కృషిచేశామని దివ్య పేర్కొన్నారు. కలెక్టర్‌గా దివ్యచేసిన కృషిని అభినందించిన ధర్మాసనం.. ఆదిలాబాద్‌ మోడల్‌ను రాష్ట్రమంతా అమలుచేసి తెలంగాణ రాష్ర్టాన్ని ఆదర్శంగా నిలుపాలని సూచించింది. తద్వారా దేశంలోని అన్ని రాష్ర్టాలకు తెలంగాణ మోడల్‌గా నిలుస్తుందని పేర్కొన్నది. తదుపరి విచారణను జూలై 16వ తేదీకి వాయిదా వేసింది.