తెలంగాణకు 4 కేంద్ర బృందాలు.. దేశవ్యాప్తంగా 50 జిల్లాల్లో స్పెషల్ టీమ్స్.. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 10, 2020

తెలంగాణకు 4 కేంద్ర బృందాలు.. దేశవ్యాప్తంగా 50 జిల్లాల్లో స్పెషల్ టీమ్స్..

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో... వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న 15 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 50 జిల్లాలకు కేంద్రం ప్రత్యేక బృందాలను(హైలెవల్ మల్టీ డిసిప్లినరీ టీమ్స్) పంపించనుంది. దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో ఈ 50 మున్సిపాలిటీల్లోనే సగానికి పైగా కేసులున్నాయి. పకడ్బందీ కంటైన్‌మెంట్ చర్యలు,టెస్టింగ్,కరోనా పేషెంట్స్ కాంటాక్ట్స్ ట్రేసింగ్ కోసం రాష్ట్రాలకు ఈ బృందాలు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాయి.

కేంద్రం పంపించిన ప్రత్యేక బృందాల్లో తెలంగాణకు 4 బృందాలు రానున్నాయి. అలాగే మహారాష్ట్రకు 7,తమిళనాడుకు 7,రాజస్తాన్‌కు 5,హర్యానాకు 4,గుజరాత్‌కు 3,కర్ణాటకకు 4,ఉత్తరాఖండ్‌కు 3,మధ్యప్రదేశ్‌కు 5,పశ్చిమ బెంగాల్‌కు 3,ఢిల్లీకి 3,బీహార్‌కు 4,ఉత్తరప్రదేశ్‌కు 4,ఒడిశాకు 5 కేంద్ర బృందాలు వెళ్లనున్నాయి.

కేంద్రం పంపించిన ఒక్కో బృందంలో ముగ్గురు సభ్యులు ఉండనున్నారు. వీరిలో ఇద్దరు పబ్లిక్ హెల్త్ ఎక్స్‌పర్ట్ లేదా ఎపిడెమాలజిస్ట్ లేదా క్లినీషియన్ ఉంటారు. అలాగే సీనియర్ జాయింట్ సెక్రటరీ హోదా కలిగిన ఓ నోడల్ అధికారి ఉంటారు. ఈ బృందాలు ఫీల్డ్‌లో పర్యటించి కంటైన్‌మెంట్ చర్యలు,క్లినికల్ మేనేజ్‌మెంట్ ఇతరత్రా చర్యలకు రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయ సహకారాలు అందిస్తాయి. మెరుగైన సమన్వయం,ఫీల్డ్‌లో సత్వర చర్యలు,వ్యూహాత్మక విధానాల కోసం ప్రత్యేక బృందాలను మోహరించామని కేంద్రం స్పష్టం చేసింది. కరోనాతో ఎఫెక్ట్ అయిన మున్సిపాలిటీలు,జిల్లాలు కేంద్ర బృందాలతో సమన్వయంలో ఉండాలని కేంద్రం సూచించింది.

Post Top Ad