కొత్తగా 872 కేసులు.. ఒక్కరోజే 7మరణాలు.. హైదరాబాద్‌లో భయానకం.. - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 23, 2020

కొత్తగా 872 కేసులు.. ఒక్కరోజే 7మరణాలు.. హైదరాబాద్‌లో భయానకం..

రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్యను పెంచడంతో దానికి అనుగుణంగా కొవిడ్-19 కేసులు కూడా భారీగా బయటపడుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 872 కొత్త కేసులు, ఏడు మరణాలు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన బులిటెన్ లో ఈ మేరకు వివరాలు వెల్లడించింది. రాజధాని హైదరాబాద్ పరిధిలోనే వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటం కలవరపరుస్తున్నది.సోమవారం నాటి పెరుగుదలతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 8,674కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 217కు పెరిగింది. కొత్త కేసులు భారీగా నమోదవుతున్నా, రికవరీ రేటు ఎక్కువగా ఉండటం ఊరటకలిగిస్తున్నది. గడిచిన 24 గంటల్లో 274 మంది వ్యాధి నుంచి కోలుకున్నట్లు బులిటెన్ లో తెలిపారు. తద్వారా ఇప్పటిదాకా డిశ్చార్జి అయినవాళ్ల సంఖ్య 4005కి పెరిగింది.
గత 24 గంటల్లో నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 713 కేసులు ఉండటం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలో 107, మేడ్చల్‌లో 16 కొత్త కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డిలో 12, మంచిర్యాలతో 5, వరంగల్ రూరల్ జిల్లాలో 6, కామారెడ్డిలో 3, మెదక్ జిల్లాలో 3, జనగాంలో 2, కరీంనగర్‌లో 2, మహబూబాబాద్‌లో 2 కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్‌లో కొత్తగా మరో కేసు నమోదైంది. హైదరాబాద్ లోని కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ యూసుఫ్(47) కరోనా కాటుకు బలైపోయారు. ఆయన మరణంపై విచారం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు.. ఫ్రంట్ లైన్లో పనిచేస్తోన్న పోలీసుల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు.