పరువు పోగొట్టుకున్న నేత ఉత్తమ్.. మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, June 01, 2020

పరువు పోగొట్టుకున్న నేత ఉత్తమ్.. మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు

నల్గొండ కలెక్టరేట్‌లో మంత్రి జగదీశ్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మధ్య వాగ్వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడారు. నల్గొండ కాంగ్రెస్ పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. బానిస మనస్తత్వాలకు అలవాటు పడ్డ కాంగ్రెస్ నేతలకు రైతులు బాగు పడటం ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. ‘‘జూన్ 2 దశాబ్దాల కల అయిన స్వరాష్ట్రం సాకారం అయిన రోజు.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ధర్నాలు చేస్తామని, బ్లాక్ డేగా పాటిస్తామని అంటున్న కాంగ్రెస్ నేతలు ముమ్మాటికి తెలంగాణ ద్రోహులే. కాంగ్రెస్ నేతలు అభివృద్ధి నిరోధకులుగా మారారు. ప్రభుత్వం ఏ పని చేసినా వ్యతిరేకించడం ఆ పార్టీకి పరిపాటిగా మారింది. ప్రజలు చీదరించి కర్ర కాల్చి వాత పెట్టినా కాంగ్రెస్‌కు బుద్ధి రావడం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమార ప్రగల్భాలు మానుకోవాలి. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఉత్తమ్ అసమర్థుడని, పీసీసీ పదవికి పనికిరాడని అంటున్నారు.

పదవుల కోసం సీమాంధ్ర నేతలకు అమ్ముడుపోయిన నీచ చరిత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డిది. అసెంబ్లీలో ప్రాజెక్ట్‌లపై మాట్లాడమంటే మేం ప్రిపేర్ అయి రాలేదు అని పరువు పోగొట్టుకున్న నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి. మొన్నటికి మొన్న హుజూర్ నగర్‌లో ఉత్తమ్‌ని చిత్తుచిత్తుగా ఓడించి ప్రజలు గుణపాఠం చెప్పారు. అయినా తీరు మార్చుకోలేదు. కాంగ్రెస్ పార్టీ నేతల్ని ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.’’ అని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు.