మోడీకి సీఎం కేసీఆర్ లేఖ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 03, 2020

మోడీకి సీఎం కేసీఆర్ లేఖ

విద్యుత్ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన
బిల్లుపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లు-2020పై రాష్ట్రాలు తమ అభిప్రాయాలను తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ప్రధానికి రాసిన లేఖలో బిల్లుపై తన అసంతృప్తిని తెలియజేశారు.
ప్రజలు, రాష్ట్ర ప్రయోజనాలు, విద్యుత్ రంగ సంస్థలకు వ్యతిరేకంగా ఈ బిల్లు ఉందని, ఈ విద్యుత్ ముసాయిదా బిల్లు-2020ను ఉపసంహరించుకోవాలని కేసీఆర్ ప్రధానిని కోరారు. ఈ బిల్లు రాష్ట్ర విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. కేంద్ర వైఖరి సమాఖ్య స్ఫూర్తిగా విరుద్ధంగా ఉందని అన్నారు.
ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలను చట్ట సవరణల ద్వారా పూర్తిగా కేంద్రం చేతిలోకి తీసుకోవడం సరికాదని, ఈ తరహా వైఖరిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. జాతీయ పునరుత్పాదన ఇంధన విధానాన్ని రాష్ట్రాల ఆమోదంతోనే అమలు చేయాలన్నారు. రాష్ట్రాల్లో నెలకొనే విభిన్న పరిస్థితుల దృష్ట్యా విధానాల రూపకల్పనలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉండాలని లేఖలో పేర్కొన్నారు.
విద్యుత్ రాయితీలకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారానే ఇవ్వాలన్న ప్రతిపాదనకు తాము వ్యతిరేకమని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణలో రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో రాయితీ చెల్లింపు విధానాలను రాష్ట్ర ప్రభుత్వాలకే విడిచిపెట్టాలని సూచించారు. ఎలాంటి రాయితీలూ లేకుండా కమిషన్ టారిఫ్ నిర్ణయించే ప్రతిపాదన వల్ల వినియోగదారులపై భారం పడుతుందని, ఈ అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేయాలన్నారు.