పదో తరగతి పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 09, 2020

పదో తరగతి పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

పదో తరగతి పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలను పూర్తిగా రద్దు చేసింది. ఇంటర్నల్ మార్కుల ఆధారంగానే విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చి ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో పరీక్షలు నిర్వహించడం విద్యార్థుల ప్రాణాలను రిస్క్‌లో పెట్టడమేనని భావించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో 5,34,903 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు లేకుండానే ప్రమోట్ అయ్యారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పలువురు విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. హైదరాబాద్ మినహా జిల్లాల్లో పరీక్షలు నిర్వహించుకోవచ్చునని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సమావేశంలో చర్చించారు. అయితే అధికారులు ఆ తీర్పుతో విబేధించారు.
హైదరాబాద్‌ను మినహాయించి జిల్లాల్లో పరీక్షలు నిర్వహిస్తే సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పరీక్షల రద్దుకే మొగ్గుచూపారు. ఇప్పటికే హర్యానా,పంజాబ్ తదితర రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే డిగ్రీ,పీజీ పరీక్షల విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.

Post Top Ad