కొవిడ్‌పై వార్‌కు కొవిఫర్‌ హెటిరో ఫార్మా సూదిమందు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, June 22, 2020

కొవిడ్‌పై వార్‌కు కొవిఫర్‌ హెటిరో ఫార్మా సూదిమందు

కరోనా వైరస్‌కు హైదరాబాదీ విరుగుడు మందు అందుబాటులోకి వచ్చింది. నగరానికి చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్‌ సంస్థ హెటిరో గ్రూప్‌.. ‘కొవిఫర్‌' పేరుతో కొవిడ్‌-19ను కట్టడిచేసే ఔషధాన్ని ఆవిష్కరించింది. ఇది అమెరికా సంస్థ గిలియడ్‌ సైన్సెస్‌కు చెందిన యాంటీ వైరల్‌ డ్రగ్‌ ‘రెమ్‌డెసివిర్‌'కు జెనరిక్‌ వెర్షన్‌. రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తికి హెటిరో సంస్థ గతంలోనే గిలియడ్‌ నుంచి లైసెన్స్‌ పొందింది. తాజాగా దేశంలో దీని తయారీ, మార్కెటింగ్‌కు భారత డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ (డీసీజీఐ) నుంచి అనుమతులు వచ్చాయి. కొవిఫర్‌ 100 మిల్లీగ్రాముల ఇంజెక్షన్‌ వయల్‌ రూపంలో అందుబాటులోకి రానున్నది. దీనిని అన్ని వయసుల వారికి వినియోగించవచ్చని సంస్థ పేర్కొన్నది. రోగి ఏ స్థితిలో ఉన్నా దీనిని వాడవచ్చని తెలిపింది. ఒక రోగికి ఎన్ని డోసులు ఇవ్వాలన్నది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని చెప్పింది. అయితే ఒక రోగికి 5-6 డోసులు ఇవ్వాల్సి రావొచ్చని సంస్థ అంచనా వేస్తున్నది. 

మెడికల్‌ షాప్‌లలో దొరుకదు 

కొవిఫర్‌ను చికిత్స పొందుతున్న రోగులకు వైద్యుల పర్యవేక్షణలో అందించాల్సి ఉంటుందని హెటిరో సంస్థ తెలిపింది. ఇది బయట మందుల దుకాణాల్లో దొరుకదని స్పష్టంచేసింది. ప్రస్తుతం కొవిఫర్‌ను ప్రభుత్వం ద్వారా నేరుగా కరోనా చికిత్స అందిస్తున్న దవాఖానలకే సరఫరా చేయనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వాలతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు చెప్పింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని హెటిరో ప్లాంట్లలో కొవిఫర్‌ ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రభుత్వం కోరినన్ని డోసులు సరఫరాచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు సంస్థ తెలిపింది. ధరను ఇంకా ఖరారు చేయలేదన్నది. ఒక్కో వయల్‌కు రూ.5000 నుంచి రూ.6000 మధ్య ఉండొచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. మరో నాలుగైదు రోజుల్లో పూర్తి వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నాయి.