భవిష్యత్‌కు పచ్చదనం కానుక - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, June 18, 2020

భవిష్యత్‌కు పచ్చదనం కానుక

హరితహారంలో ప్రజలందరూ పెద్దఎత్తున పాల్గొని భవిష్యత్‌ తరాలకు పచ్చదనాన్ని కానుకగా అందించే లక్ష్యంతో ముందుకుసాగాలని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ పరిధిలో ఎవరైనా మొక్కలు కావాల్సి వస్తే నగరంలోని నర్సరీల నుంచి ఉచితంగా తీసుకొనే అవకాశం ఉన్నదని తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో నగరంలో నర్సరీలున్న ప్రాంతాలతోపాటు వాటి పూర్తి వివరాలతో సమగ్ర సమాచారాన్ని ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి భారీ స్థాయిలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టనున్నదని పేర్కొన్నారు.
బుధవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని హెచ్‌ఎండీఏ నర్సరీని ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. అన్ని పురపాలికల్లో హరితహారాన్ని విజయవంతంచేసేందుకు మున్సిపల్‌శాఖ అన్ని చర్యలు తీసుకొంటున్నట్టు స్పష్టంచేశారు. అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఈసారి మరింత చొరవతో మొక్కలు నాటనున్నట్టు తెలిపారు. పట్టణాల్లో నాటే ప్రతి మొక్కను కాపాడేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. పట్టణాలన్నింటినీ హరితవనాలుగా మార్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు పాటుపడాలని కోరారు. ముఖ్యంగా పట్టణాల్లో మొక్కలు నాటడంతోపాటు వాటిని పెంచడంపైన ఇప్పటికే శాఖ తరఫున ప్రత్యేక ఆదేశాలు జారీచేశామని వివరించారు.
శంషాబాద్‌లో హెచ్‌ఎండీఏ నర్సరీలో మొక్కలను పెంచుతున్న తీరు, ఎలాంటి మొక్కలు అందుబాటులో ఉన్నాయి? వాటిని ప్రజలకు అందించే ప్రక్రియ వంటి అంశాలపై మంత్రి కేటీఆర్‌ అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ఇప్పటికే పలు పట్టణాలకు మొక్కలను తమ నర్సరీల నుంచి హెచ్‌ఎండీఏ సరఫరా చేస్తున్నదని అధికారులు వివరించారు. నర్సరీలో పనిచేస్తున్న కార్మికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకొన్న మంత్రి, నర్సరీలలో పనిచేస్తున్నవారిలో అర్హులైన వారందరికీ ఈఎస్‌ఐ, పీఎఫ్‌ వంటి సౌకర్యాలు కల్పించే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు.