ఆర్థికవేత్త బీపీఆర్‌ విఠల్‌ ఇకలేరు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, June 20, 2020

ఆర్థికవేత్త బీపీఆర్‌ విఠల్‌ ఇకలేరు

ప్రఖ్యాత ఆర్థికవేత్త, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి బీపీఆర్‌ విఠల్‌ (93) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు శనివారం మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన 1950 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. విఠల్‌కు భార్య శేషు, కుమార్తె నివేదిత, కుమారులు సంజయ్‌బారు, చైతన్యబారు ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్‌బారు ప్రముఖ పాత్రికేయుడు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మీడియా సలహాదారుగా కూడా పనిచేశారు. 

వివిద హోదాల్లో సేవలు

బీపీఆర్‌ విఠల్‌ 1972 నుంచి 1982 వరకు పదేండ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక, ప్రణాళికశాఖ కార్యదర్శిగా పనిచేశారు. దేశంలోనే సుదీర్ఘకాలంపాటు పనిచేసిన ఆర్థిక కార్యదర్శిగా రికార్డు సృష్టించారు. ఉమ్మడి ఏపీ స్టేట్‌ ప్లానింగ్‌ బోర్డు డిప్యూటీ చైర్మన్‌గా, పదో ఆర్థిక సంఘం సభ్యుడిగా, కేరళ ప్రభుత్వ వ్యయ కమిషన్‌ చైర్మన్‌గానూ విధులు నిర్వర్తించారు. ఆ తరువాత సూడాన్‌, మలావి దేశాలకు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) సలహాదారుగా పనిచేశారు. హైదరాబాద్‌లో సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌)ను స్థాపించారు. 

విద్యాభ్యాసం తెలంగాణలోనే..

బీపీఆర్‌ విఠల్‌ తండ్రి ప్రొఫెసర్‌ బీవీ రామనరసు హైదరాబాద్‌లోని నిజాంకాలేజీలో ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌గా, వరంగల్‌ ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ఆ సమయంలో విఠల్‌ హైదరాబాద్‌లోని మదర్సా-ఈ- అలిమా హైస్కూల్‌లో చదివారు. 1942లో హైదరాబాద్‌ నిజాంకాలేజీలో డిగ్రీ చదువును మధ్యలో ఆపేసి, ముంబైలో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ నిర్వహించిన క్విట్‌ఇండియా ఉద్యమంలో  పాల్గొన్నారు. గాంధీజీ సలహా మేరకు విఠల్‌ మద్రాస్‌లో చదువు కొనసాగించారు. మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీలో చేరిన ఆయన మొట్టమొదటి స్టూడెంట్స్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా ఎన్నికవటం విశేషం. కాలేజీ భవనంపై త్రివర్ణ పతాకం ఎగురవేసిన మొదటి అధ్యక్షుడిగా విఠల్‌ గుర్తింపు పొందారు. 1949లో హైదరాబాద్‌ సివిల్‌ సర్వీసెస్‌లో చేరిన విఠల్‌, 1950లో ఐఏఎస్‌కు అర్హత సాధించి వివిధ హోదాల్లో పనిచేశారు. విఠల్‌ బాల్యం నుంచి తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎండగడుతూ వచ్చారు. ఐఏఎస్‌ అధికారిగా ఇక్కడి ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన ఆయన రాసిన ‘తెలంగాణ సర్‌ప్లసెస్‌- ఏ కేస్‌ స్టడీ’ పరిశోధన పత్రం ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను రూపొందించడంలో ప్రభావవంతమైన పాత్ర పోషించింది. 

విఠల్‌ మృతి తీరనిలోటు

ప్రముఖ ఆర్థికవేత్త బీపీఆర్‌ విఠల్‌ మృతితీరని లోటని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌ నివాళులర్పించారు. ఆరుదశాబ్దాల క్రితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని ఎలుగెత్తి చాటిన ఘనుడని పేర్కొన్నారు. విఠల్‌ మృతిపట్ల ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, రాష్ట్ర ఐఏఎస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఎంసీహెచ్‌ ఆర్డీ డైరెక్టర్‌ జనరల్‌ బీపీ ఆచార్య ఓ ప్రకటనలో సంతాపం వ్యక్తంచేశారు.

ఆయన సేవలు స్ఫూర్తిదాయకం 

  • ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
‘విఠల్‌ ఇక లేరనే విషయం తీవ్ర విచారకరం. తొలితరం సివిల్‌ సర్వీసెస్‌ అధికారిగా ఆయన చేసిన కృషి, ఆయన జీవితం ఎంతోమంది ఐపీఎస్‌ అధికారులకు స్ఫూర్తిదాయకం’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

సెస్‌ స్థాపన ఘనత ఆయనదే :ముఖ్యమంత్రి కేసీఆర్‌  

ప్రముఖ ఆర్థికవేత్త, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి బీపీఆర్‌ విఠల్‌ మృతిపై సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తంచేశారు. ఆర్థిక, ప్రణాళికశాఖల కార్యదర్శిగా, ప్లానింగ్‌ బోర్డు డిప్యూటీ చైర్మన్‌గా, ఆర్థికవేత్తగా రాష్ర్టానికి, పదో ఆర్థికసంఘం సభ్యుడిగా దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఐఎంఎఫ్‌ సలహాదారుడిగా వెనుకబడిన దేశాలకు సలహాలు ఇచ్చారని చెప్పారు. హైదరాబాద్‌లో సెస్‌ స్థాపించారని, ఇలా ఆయన రాష్ట్రానికి, దేశానికి చేసిన సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సందేహాలు నివృత్తి చేసిన వ్యాసం: ఐటీ మంత్రి కేటీఆర్‌

‘ప్రత్యేకరాష్ట్రంగా తెలంగాణ మనుగడపై నా అనుమానాలన్నింటినీ ‘తెలంగాణ సర్‌ప్లసెస్‌- ఏ కేస్‌ స్టడీ’ పరిశోధనపత్రం ద్వారా విఠల్‌ నివృత్తి చేశారు.’ అని ఐటీ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. గతంలో విఠల్‌ను కలిసిన, ఆయనతో పలు అంశాలపై చర్చించినప్పటి ఫొటోలను ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు.