ముందే పలుకరించిన గోదారమ్మ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, June 15, 2020

ముందే పలుకరించిన గోదారమ్మ

గోదారమ్మ పరవళ్లు నెమ్మదిగా మొదలవుతున్నాయి. గతేడాదికంటే ముందుగానే బేసిన్‌ లో వరద పలుకరించింది. ప్రాణహిత నుంచి మొన్నటిదాకా 2-3 వేల క్యూసెక్కులు ఉన్న వరద ఆదివారం ఉదయానికి పదివేల క్యూసెక్కులు దాటింది. సాయంత్రం ఆరుగంటల సమయానికి లక్ష్మీబరాజ్‌కు 15 వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతున్నదని అధికారులు తెలిపారు. ఇది క్రమంగా పెరుగుతున్నదని చెప్పారు. ఈ ప్రవాహాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మహారాష్ట్ర వాతావరణశాఖ అధికారులనూ సంప్రదిస్తూ.. ప్రధాన గోదావరితోపాటు ఉపనదుల నుంచి వరద ఎలా ఉంటుందనే దానిపై అంచనాలు రూపొందిస్తున్నారు. ప్రాణహిత నుంచి ఏటా భారీగానే వరద నమోదవుతున్నది. అటు ప్రధాన గోదావరిపై శ్రీరాంసాగర్‌, ఇటు కడెం నుంచి ఎల్లంపల్లి జలాశయానికి వరద పరిస్థితిపై అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలోనే తెరిచిన లక్ష్మీబరాజ్‌ గేట్లను అదేవిధంగా ఎత్తి ఉంచారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో లక్ష్మీపంప్‌హౌజ్‌లో మోటర్లను సిద్ధం చేసినప్పటికీ.. ఎత్తిపోత మాత్రం ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు లేవని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. ప్రధాన గోదావరిలో వరద వచ్చే అవకాశాలు పూర్తిగా లేవనే నిర్ధారణకు వచ్చాకనే లక్ష్మీబరాజ్‌ నుంచి ఎల్లంపల్లి వరకు ఎత్తిపోత (లింక్‌-1)పై దృష్టిసారించనున్నారు. 

వేగంగా గేజ్‌ స్టేషన్ల ఏర్పాటు

కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్‌లవారీగా మోటర్ల ఎత్తిపోత అత్యంత కీలకం. ఎగువ నుంచి వచ్చే వరదను అంచనా వేసుకుంటూ ఆయా మార్గాల్లో జలాలను తరలించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అన్నిమార్గాల్లో సొంతంగా గేజ్‌ స్టేషన్లను ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్‌ కొన్నిరోజుల క్రితం అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ఈఎన్సీ ఎన్‌ వెంకటేశ్వర్లుకు ఈ బాధ్యతను అప్పగించగా.. పది రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తిచేశారు. ఎగువ నుంచి తెలంగాణకు వచ్చే వరదను లెక్కించేందుకు కేంద్ర జలసంఘానికి చెందిన ఐదు గేజ్‌స్టేషన్లు మాత్రమే ఉండేవి. వీటిద్వారా వరద వివరాలు సమగ్రంగా వచ్చే అవకాశంలేదని గుర్తించిన అధికారులు.. ప్రధాన గోదావరితోపాటు వార్దా, పెన్‌గంగ, కడెం, మంజీర, మానేరు, ఇంద్రావతి, ప్రాణహితపై పన్నెండు చోట్ల కొత్తగా గేజ్‌ స్టేషన్లు ఏర్పాటుచేశారు. ప్రస్తుతం వీటిని మాన్యువల్‌గానే నిర్వహిస్తుండగా.. అధునాతన పరికరాలు, సెన్సర్లను ఏర్పాటుచేసేందుకు టెండర్లు పిలువనున్నారు. గోదావరి చుట్టూ ఏర్పాటుచేసిన గేజ్‌స్టేషన్లతో వరద పరిస్థితిని అంచనావేసి కాళేశ్వరం మోటర్లను ప్రణాళిక ప్రకారం నడుపనున్నట్లు ఈఎన్సీ వెంకటేశ్వర్లు తెలిపారు.