ప్రధాని పిలుపునకు నాడు కేసీఆర్ ‘చప్పట్లు’.. నేడు ఈటల విమర్శలు! - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 23, 2020

ప్రధాని పిలుపునకు నాడు కేసీఆర్ ‘చప్పట్లు’.. నేడు ఈటల విమర్శలు!

రోనా పేరుతో బీజేపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. కరోనా నివారణకు, చికిత్సకు నిధులివ్వని కేంద్రం.. చప్పట్లు కొట్టండి, దీపాలు వెలిగించండి అంటూ చేతులు దులుపుకొంటోందని విమర్శించారు. తెలంగాణ తెచ్చుకున్న టెస్టింగ్‌ మిషన్లను వేరే రాష్ట్రాలకు తరలిస్తోందని ఆరోపించారు. కరోనా నియంత్రణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై సోమవారం (జూన్ 22) మంత్రి ఈటల స్పందించారు.
కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం ముందుందని ఈటల తెలిపారు. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడానికి కరోనా టెస్టింగ్‌ మిషన్లకు ఆర్డర్‌ చేశామని చెప్పారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్‌లో ఎమర్జెన్సీ అంటూ దాన్ని కోల్‌కతాకు తరలించిందని ఆరోపించారు.

రోజుకు 3500 నుంచి 4000 పరీక్షలు చేయగల సామర్థ్యం ఉన్న రోస్‌ కంపెనీకి చెందిన కోబోస్‌ 8800 మిషన్లను దేశంలో మొదటిసారి తెలంగాణనే ఆర్డర్‌ చేసిందని ఈటల తెలిపారు. దేశానికి వచ్చిన మొదటి మిషన్‌ను కేంద్రం బెంగాల్‌కు పంపిందని విమర్శించారు. ఈ టెస్టింగ్ మిషన్ల కోసం ఆర్డర్‌ చేసిన లేఖలను ఆయన మీడియాకు విడుదల చేశారు.

తెలంగాణ పట్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత ఇంకెవరికీ ఉండదని మంత్రి ఈటల స్పష్టం చేశారు. తమ చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించలేరని వ్యాఖ్యానించారు. కరోనా నియంత్రంణ కోసం ఖర్చులో వెనుకాడకుండా రాష్ట్రం ప్రత్యేక చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు.

తెలంగాణలో కమ్యూనిటీ వ్యాప్తి 122 శాతం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి ఈటల ఖండించారు. తెలంగాణలో కరోనా కేసుల పేరుతో భోగస్ సర్వే జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హై రిస్క్‌లో తెలంగాణ అంటూ India.in.pixels చేసిన సర్వే పూర్తిగా తప్పుడు సమాచారమని పేర్కొన్నారు. దేశంలో అత్యధిక శాతం కమ్యూనిటీ స్ప్రెడ్‌కు ఛాన్స్ ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తప్పుపట్టారు. రాష్ట్రంలో కమ్యూనిటీ స్ప్రెడ్ లేదని ఐసీఎంఆర్ సర్వే చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.

కొవిడ్-19తో పోరాటం చేస్తున్న యోధులకు మద్దతుగా ప్రధాని చప్పట్లు కొట్టాలని, కొవ్వొత్తులు వెలిగించాలని ప్రధాని మోదీ మార్చిలో పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. నాడు ప్రధానిపై విమర్శలు కురిపిస్తూ సోషల్ మీడియాలో కొంత మంది అనుచిత కామెంట్లు పెట్టడంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ఐక్యతను ప్రదర్శించాలంటూ ప్రధాని పిలుపునిస్తే.. కొంత మంది మూర్ఖులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మార్చి 21న మండిపడ్డారు. సరిగ్గా మూడు నెలల తర్వాత మంత్రి ఈటల.. నాడు ప్రధాని చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చేయడం గమనార్హం.