పీవీకి సీఎం కేసీఆర్ ఘన నివాళి.. నెక్లెస్‌రోడ్డులో ఘనంగా వేడుకలు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, June 28, 2020

పీవీకి సీఎం కేసీఆర్ ఘన నివాళి.. నెక్లెస్‌రోడ్డులో ఘనంగా వేడుకలు

హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో పీవీ జ్ఞాన భూమి వద్ద జరిగిన శత జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ చిత్ర పటానికి నివాళులర్పించారు. సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, పలువురు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ నేతలు కూడా పీవీకి ఘన నివాళి అర్పించారు. సీఎం కేసీఆర్‌తో పాటు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి వేదిక వద్దకు చేరుకోవడం విశేషం. ఈ కార్యక్రమానికి పీవీ కుటుంబ సభ్యులు, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీవీ జ్ఞానభూమిలో సర్వమత ప్రార్థనలను నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌‌, శ్రీనివాస్‌గౌడ్‌, టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత కేశవరావు, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు పీవీ చిత్రపటం వద్ద నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 100వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సేవలను పలువురు నేతలు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ పీవీకి నివాళి అర్పించారు. ట్విట్టర్‌ ద్వారా ఆదివారం కేటీఆర్ స్పందిస్తూ తెలంగాణ భూమి పుత్రుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని కొనియాడారు. ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నట్లు ప్రకటించారు.


రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు కూడా పీవీకి ఘన నివాళులర్పించారు. ట్విట్టర్‌ ద్వారా.. తెలంగాణ నేల సృష్టించిన అద్భుత మేధస్సు పీవీ నరసింహారావు. ఆలోచనాపరుడిగా, సాహితీవేత్తగా, బహుభాషా కోవిధుడిగా, పరిపాలనా దక్షుడిగా, రాజనీతిజ్ఞుడిగా ఆయన చూపిన ప్రజ్ఞ ఆమోఘం, అనితర సాధ్యం. ఆర్థిక సంస్కరణలతో ఆధునిక భారతదేశానికి శ్రీకారం చుట్టిన ఘనత ఆయనదే. ఆ మహనీయుని శతజయంతి ఉత్సవం మొదలైన సందర్భంగా తెలంగాణ ఠీవీ పీవీని ఘనంగా స్మరించుకుందాం. ఘన నివాళులు అర్పిద్దాం’’ అని మంత్రి హరీశ్‌రావు ట్విటర్‌లో రాశారు.