మెదక్‌ ఎమ్మెల్యేపై దుష్ప్రచారం.. పోలీసుల కేసు నమోదు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 16, 2020

మెదక్‌ ఎమ్మెల్యేపై దుష్ప్రచారం.. పోలీసుల కేసు నమోదు

తనకు కరోనా సోకినట్లుగా జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణవ్యాప్తంగా సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో మెదక్‌ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌ అన్న అసత్య ప్రచారం జోరుగా కొనసాగుతుంది. దీంతో ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు, ఇతర అనుచరులు మెదక్‌ జిల్లావ్యాప్త పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదులు చేశారు. అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.
ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో వెంటనే హైదరాబాద్‌కు తరలివెళ్లినట్లుగా దీంతో ఆమె కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌లో ఉంచినట్లుగా సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుంది. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ... తప్పుడు ప్రచారాన్ని కొట్టిపారేశారు. తాను, తన కుటుంబ సభ్యులు ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. అసత్య ప్రచారంపై ఫిర్యాదును స్వీకరించిన మెదక్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తును చేపట్టారు.