ఆరేళ్ల తెలంగాణ.. - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 02, 2020

ఆరేళ్ల తెలంగాణ..

జూన్ 2.. తెలంగాణ చరిత్రలో ఎన్నటికీ మర్చిపోలేని రోజు ఇది. 60 ఏళ్ల తరబడి పోరాటాలు.. ఎన్నో ఉద్యమాలు.. ఎందరో అమర వీరుల ప్రాణత్యాగాల ఫలంగా ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన రోజు ఇది. ఉమ్మడి రాష్ట్రంలో తమకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా శక్తి వంచన లేకుండా పోరాడిన తెలంగాణ ప్రజలు.. సొంత రాష్ట్ర కలను నెరవేర్చుకున్నారు. 1969 నుంచే తెలంగాణ కోసం ఉద్యమాలు ప్రారంభం కాగా.. టీఆర్ఎస్ ఆవిర్భావంతో తెలంగాణ ఉద్యమానికి రాజకీయ వేదిక దొరికినట్లయ్యింది. 2009లో కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షతో తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరింది. 2011లో చేపట్టిన సకల జనుల సమ్మెతో ఢిల్లీ పాలకుల్లో ఆలోచన మొదలైంది. చివరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా 2013 జూలైలో కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసమంటూ జనం కొట్లాడి మరీ సాధించుకున్న తెలంగాణ.. ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి ఆరేళ్లు పూర్తయ్యాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక ఏ మార్పులొచ్చాయో చూద్దాం.

విద్యుల్లతల తెలంగాణ

2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగా.. తొలి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. ఈ ఆరేళ్లలో రాష్ట్రం ఎంతో ప్రగతి సాధించింది. తెలంగాణ వస్తే చీకట్లు తప్పవని నాటి పాలకుల చేసిన హెచ్చరికలు తప్పని నిరూపిస్తూ.. విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయడమే కాదు.. సోలార్, థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని సైతం గణనీయంగా పెంచుకుంది. విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగినా సరే.. డిమాండ్‌కు సరిపడా సరఫరా చేస్తోంది. కేటీపీఎస్‌లో 800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్‌ను నిర్మించడంతోపాటు.. భూపాలపల్లిలో మధ్యలో ఆగిపోయిన 600 మెగావాట్ల కేటీపీపీని ఏడాదిలోపే పూర్తి చేసింది. విద్యుల్లతల తెలంగాణగా రాష్ట్రం అవతరించింది.

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ భేష్

గతంలో తెలంగాణ ప్రాంతం కరువు కాటకాలతో తీవ్రంగా సతమతం అయ్యేది. ఉమ్మడి రాష్ట్రంలో చెరువులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఈ తప్పిదాన్ని సరిదిద్దేందుకు కేసీఆర్ సర్కారు మిషన్ కాకతీయ పేరిట చెరువులను పునరుద్ధరణకు నడుం బిగించింది. వేలాది చెరువులకు పునరుజ్జీవం పోసింది. దీంతో చెరువులు నీటితో కళకళలడాతున్నాయి. ఇక తెలంగాణలో మరో ప్రధాన సమస్య ఫ్లోరైడ్. నల్గొండలో ఉన్న ఫ్లోరైడ్ బాధితులను చూస్తే మనసు విలవిల్లాడుతుంది. ఇలాంటి కష్టం పగోడికి కూడా రావద్దనిపిస్తుంది. దీనికి ప్రాధాన కారణం తాగునీరు. దీంతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఏర్పాటు చేసి మంచి నీరు అందిస్తున్నారు. గోదావరి తలాపునే పారుతున్నా.. ఇన్నాళ్లూ బోరు నీళ్లు మాత్రమే తాగిన పల్లెవాసులు ఇప్పుడు గోదావరి నీళ్లను రుచి చూస్తున్నారు.