మెడికల్ కాలేజీలకు కరోనా భయం.. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 03, 2020

మెడికల్ కాలేజీలకు కరోనా భయం..

కరోనావైరస్ తెలంగాణలో విజృంభిస్తోంది. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో అయితే విశ్వరూపం చూపిస్తోంది. తాజాగా ఈ మహమ్మారి హైదరాబాదులోని మెడికల్ కాలేజీలను భయపెడుతోంది. రెండు రోజుల క్రితం ఉస్మానియా మెడికల్ కాలేజీలోని పీజీ విద్యార్థులకు కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయిన కొద్ది గంటలకే బుధవారం రోజున మరో ప్రముఖ మెడికల్ కాలేజీ నిమ్స్‌లో పలువురు మెడికల్ విద్యార్థులకు కరోనాసోకడం ఆందోళనకు గురిచేస్తోంది. ఎక్కువగా హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులకే కరోనావైరస్ సోకుతుండటంతో అంతా భయంతో కాలం వెల్లదీస్తున్నారు.
ఇక కరోనావైరస్ మెడికల్ కాలేజీలపై పంజా విసురుతుండటంతో హైదరాబాదులోని మెడికల్ కాలేజీలు అత్యవసర చర్యలు చేపట్టాయి. ముందుగా హాస్టల్ విద్యార్థులకు కరోనావైరస్ టెస్టులు నిర్వహించడం అదే సమయంలో పరిసరాలను శానిటైజ్ చేస్తున్నారు. ఇక తాజాగా నిమ్స్‌లో ఏడుగురు పీజీ వైద్య విద్యార్థులకు కరోనావైరస్ సోకింది. వీరంతా హాస్టల్‌కు చెందిన విద్యార్థులుగా సమాచారం. పీజీ విద్యార్థులకు కరోనాసోకడంతో వారి కాంటాక్ట్స్‌ను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు . ఇక ఉస్మానియా, గాంధీ, నిమ్స్ హాస్టల్ విద్యార్థులను క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. మొత్తం మూడు మెడికల్ కాలేజీల నుంచి 600కు పైగా మెడికోలు క్వారంటైన్‌లో ఉన్నారు.
ఉస్మానియా మెడికల్ కాలేజీ హాస్టల్‌లో 280 మంది విద్యార్థులు క్వారంటైన్‌లో ఉండగా...250 మంది గాంధీ మెడికల్ కాలేజీ హాస్టల్ విద్యార్థులు క్వారంటైన్‌లో ఉన్నట్లు సమాచారం. ఇక తాజాగా నిమ్స్ మెడికల్ హాస్టల్‌లో విద్యార్థులకు కరోనా పాజిటివ్ తేలడంతో అక్కడ 95 మంది విద్యార్థులను అధికారులు క్వారంటైన్‌లో ఉంచారు. ఇక మెడికల్ కాలేజీ పీజీ స్టూడెంట్స్‌కు ఈ నెలలో పరీక్షలు ఉన్నందున వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ డాక్టర్లు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి వారి పరిస్థితిని వివరించాలని భావిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఉస్మానియా మెడికల్ కాలేజీలో 23 మంది పీజీ విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.