సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులలో సంభవించిన భారీ పేలుడుతో నలుగురు కాంట్రాక్ట్ కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు.మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే ఈ ఓపెన్ కాస్ట్ గనులను నిర్వహిస్తున్న మహాలక్ష్మి ఓబీ కంపెనీపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒకపక్క భారీ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలు కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఆందోళన బాట పట్టగా,సింగరేణి ప్రమాదం విషయంలో కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేస్తానని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు.
నిబంధనలు తుంగలో తొక్కి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఓపెన్ కాస్ట్ లో ప్రమాదం జరిగి నలుగురు కార్మికులు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని ఆయన మండిపడ్డారు. సింగరేణి రామగిరి మండల ఓపెన్ కాస్ట్ గనిలో జరిగిన ప్రమాదంపై విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్న నేపథ్యంలో వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.