టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కరోనా పాజిటివ్... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, June 13, 2020

టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కరోనా పాజిటివ్...


టీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనా అనుమానంతో ఆయన పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ 19 సోకిన మొదటి ఎమ్మెల్యేగా ఆయన వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో క్వారెంటైన్‌లో ఉన్నట్టు సమాచారం. ముత్తిరెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆయనతో తిరిగిన కార్యకర్తలు,నాయకుల్లోనూ ఆందోళన నెలకొంది.
మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తీవ్రమవుతోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతీరోజూ 100కి పైగా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో 164 కొత్త కేసులు నమోదవగా.. ఇందులో 133 జీహెచ్ఎంసీలోనే నమోదయ్యాయి.అలాగే గత వారం రోజులకు పైగా ప్రతీరోజూ రాష్ట్రంలో ఐదుగురికి పైనే కరోనాతో మరణిస్తున్నారు. గత ఆదివారం (జూన్ 7) రాష్ట్రంలో అత్యధికంగా 14 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు.
గురువారం(జూన్ 11) 9 మంది మృత్యువాత పడగా.. శుక్రవారం మరో 9 మంది మృత్యువాత పడ్డారు. హైదరాబాద్‌లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరోసారి నగరంలో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తారన్న ప్రచారం మొదలైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దీనిపై మాట్లాడుతూ.. రెండు,మూడు రోజుల్లో ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుని ఒక ప్రకటన చేస్తుందన్నారు. నగరంలో లాక్ డౌన్‌కు అవకాశం ఉందని స్పష్టం చేశారు.