ఆపరేషన్ కమలం.. పని మొదలుపెట్టిన బండి సంజయ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 09, 2020

ఆపరేషన్ కమలం.. పని మొదలుపెట్టిన బండి సంజయ్

తెలంగాణలో పార్టీ బలోపేతం మీద బీజేపీ నేతలు ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో మోదీ చరిష్మాతో 4 లోక్ సభ స్థానాలను గెలుపొందిన బీజేపీ.. వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయినప్పటికీ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో జెండా ఎగరేయాలని భావిస్తోంది. ఇటీవలే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. బీజేపీలోకి చేరికలను ప్రోత్సహిస్తున్నారు.

ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ లోక్ సభ స్థానాలను గెలుపొందిన బీజేపీ.. ఈసారి పెద్దపల్లి స్థానాన్ని సైతం గెలుచుకోవాలనే లక్ష్యంతో పని చేస్తోంది. ఈ క్రమంలోనే పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఎలువాక రాజయ్యలను బీజేపీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. వీరిద్దరూ గత కొంతకాలంగా టీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో బండి సంజయ్ వీరితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వారు కూడా కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం.

గత లోక్ సభ ఎన్నికల ముందే వివేక్‌ను పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ ప్రయత్నించింది. ఆయనకే టికెట్ ఇవ్వాలని భావించింది. కానీ ఆయన ముందుకు రాకపోవంతో సోగ్లా కుమార్‌కు టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేశ్ నేత విజయం సాధించగా.. కాంగ్రెస్ రెండో స్థానంలో, బీజేపీ మూడో స్థానంలో నిలిచాయి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బండి సంజయ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటం, వివేక్ కూడా పార్టీ బలోపేతంపై దృష్టి సారించడంతో.. జిల్లాలోని ఇతర పార్టీల నాయకులు బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి వివేక్ పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉండటంతో.. ఈసారి ఇక్కడ ఎలాగైనా కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.

Post Top Ad