రైతు బంధు గైడ్ లైన్స్ ఇవే... ఎవరెవరికి పథకం వర్తిస్తుందంటే... - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 16, 2020

రైతు బంధు గైడ్ లైన్స్ ఇవే... ఎవరెవరికి పథకం వర్తిస్తుందంటే...

ఈ ఏడాది వానాకాలం పంట పెట్టుబడికి మరో వారం,పది రోజుల్లో రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.7వేల కోట్లు వెచ్చిస్తోంది. నియంత్రిత పద్దతిలో వ్యవసాయ విధానానికి రైతులంతా సిద్దంగా ఉండటంతో.. త్వరగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించారు.

వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. గతంలో లాగే ఈ వానాకాలంలో ఎకరానికి రూ.5వేలు చొప్పున రైతు బంధు సాయం అందించనున్నారు. బడ్జెట్ ప్రతిపాదనల సమయంలో జనవరి 23న సీసీఎల్ఏ ఇచ్చిన జాబితాలోని పట్టాదారులకు మాత్రమే రైతు బంధు సాయం అందనుంది. ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా ఆర్థిక సాయం అందుతుంది. ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని పెద్దపల్లి జిల్లాలోని కాసుపల్లి దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న 621 మంది పట్టాదారులకు కూడా రైతు బంధు అందించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

దశలవారీగా సాగే రైతు బంధు పథకంలో మొదట తక్కువ భూమి కలిగిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తారు. ఆ తర్వాత పెద్ద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. ఒకవేళ ఎవరైనా ప్రభుత్వం ఇచ్చే రైతు బంధును వద్దనుకుంటే 'గివ్ ఇట్ అప్' ఫారంను సమర్పించాలి. అప్పుడు ఆ డబ్బును రైతు బంధు సమితి ఖాతాలో జమ చేస్తారు.