చెస్ట్ ఆస్పత్రిలో నిన్న రవి.. నేడు సయ్యద్ బలి.. భయానక పరిస్థితులు... - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 30, 2020

చెస్ట్ ఆస్పత్రిలో నిన్న రవి.. నేడు సయ్యద్ బలి.. భయానక పరిస్థితులు...

ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక రవి అనే యువకుడు మృతి చెందిన ఘటన మరవకముందే మరో విషాదం చోటు చేసుకుంది. సయ్యద్ అనే మరో వ్యక్తి సోమవారం(జూన్ 29) ఆక్సిజన్ అందక మృతి చెందాడు. రవి లాగే సయ్యద్ కూడా చెస్ట్ ఆస్పత్రిలో తనకు సరైన చికిత్స అందడం లేదంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. రెండు రోజుల వ్యవధిలోనే చెస్ట్ ఆస్పత్రిలో ఇద్దరు పేషెంట్లు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. అదే సమయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్‌కి చెందిన ఓ వైద్యుడు ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ హైదరాబాద్‌లో పరిస్థితి ఆందోళనకరంగానే ఉందన్నారు. 'కరోనా పేషెంట్లందరికీ ఆక్సిజన్ అవసరం ఉండకపోవచ్చు. కానీ 5శాతం పేషెంట్లకు కూడా ఆక్సిజన్ అందట్లేదంటే ప్రభుత్వం చేతులెత్తేసినట్టే. ముందు నుంచి కేవలం గాంధీ ఆస్పత్రి పైనే ఆధారపడటం కూడా నిజానికి సరైన విధానం కాదు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అనేది కనీస అవసరం.. దానికి పెద్దగా ఖర్చు కూడా కాదు. అది కూడా అందించట్లేదంటే మనం ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నామో...' అంటూ ఆ వైద్యుడు పేర్కొన్నారు.
ప్రభుత్వాస్పత్రుల్లో చాలామంది వైద్యులకు ప్రభుత్వం ఇప్పటికీ పీపీఈ కిట్లు,మాస్కులు ఇవ్వట్లేదన్న విమర్శలున్నాయి. ఎన్‌జీవోలు ఇచ్చినవి లేదా సొంత డబ్బులతో కొనుక్కున్న వాటితోనే వాళ్లు పనిచేస్తున్నారు. ఒక్క పీపీఈ కిట్‌ను ఆరు గంటలకు మించి వాడితే ఉపయోగం ఉండదు. అలాగే ఎన్‌ 95 మాస్కు కూడా. కానీ మన వైద్యులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ దాదాపు 12 గంటలు ఒకే పీపీఈ సూట్‌లో పనిచేస్తున్నారు. అందుకే వైద్యులు సైతం కరోనా బారిన పడుతున్న పరిస్థితి.' అని ఆ వైద్యుడు చెప్పారు.