డిగ్రీ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇకపై నచ్చిన సబ్జెక్టులు ఎంచుకోవచ్చు.! - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 16, 2020

డిగ్రీ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇకపై నచ్చిన సబ్జెక్టులు ఎంచుకోవచ్చు.!

తెలంగాణలోని డిగ్రీ విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఇక నుంచి తమకు నచ్చిన సబ్జెక్టుల కాంబినేషన్లను ఎంచుకునే అవకాశం కల్పించనుంది. ఇప్పటికే అడ్డదిడ్డంగా ఉన్న డిగ్రీ కాలేజీల అడ్మిషన్లను ‘దోస్త్’ రూపంలో చెక్ పెట్టిన సర్కార్.. సబ్జెక్టుల ఎంపిక విషయంలో బకెట్ విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తోంది.
ఇప్పటివరకు విద్యార్ధులు.. వారు చేరిన కాలేజీలలో ఉన్న కోర్సులను మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. కానీ వచ్చే విద్యా సంవత్సరం(2020-21) నుంచి మాత్రం స్టూడెంట్స్ తమకు ఇష్టమైన కాంబినేషన్లలో సబ్జెక్టులను ఎంచుకునే అవకాశం కల్పించనుంది. ఈ బకెట్ విధానం అమలులోకి వస్తే.. బీఏ, బీకాం చదివే విద్యార్ధులతో పాటు సివిల్స్, గ్రూప్ ఎగ్జామ్స్ రాసేవారికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యాశాఖ భావిస్తోంది. విద్యార్ధి చేరిన కాలేజీలో తనకు నచ్చిన సబ్జెక్ట్ లేకపోతే ఆన్లైన్ ద్వారా చదువుకునే అవకాశం కూడా ఉంది.
అసలు ఏంటీ బకెట్ విధానం..?
ఒక్కో బకెట్‌లో కొన్ని సబ్జెక్టులు కలిపి ఉంటాయి. విద్యార్ధి ప్రతీ బకెట్‌లో నుంచి ఒక సబ్జెక్టును ఎంచుకోవాలి. ఉదాహరణకు బీఎస్సీ డిగ్రీ.. రెండు విభాగాలు.. ఒకటి ఫిజికల్ సైన్స్.. ఇంకొకటి లైఫ్ సైన్స్. బీఎస్సీ ఫిజికల్ సైన్స్ తీసుకునేవారు మ్యాథ్స్, లైఫ్ సైన్స్ తీసుకునేవారు కెమిస్ట్రీ తప్పకుండా చదవాలి. ఇక మిగిలిన రెండు సబ్జెక్టులు విద్యార్ధి ఇష్టం. ఒకవేళ వారికి నచ్చిన సబ్జెక్ట్ అందులో లేకపోతే ఆన్లైన్ ద్వారా చదువుకోవచ్చు. ఈ బకెట్ విధానాన్ని ప్రయోగాత్మకంగా గత విద్యా సంవత్సరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో అమలు చేశారు. ఇప్పుడు అన్ని ప్రైవేట్ కాలేజీలలోనూ అమలు చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.