తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల: అమ్మాయిలే టాప్ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, June 18, 2020

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల: అమ్మాయిలే టాప్

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. 9.50లక్షల మంది ఇంటర్మీడియట్ పరీక్షలను రాశారని తెలిపారు.
ఇంటర్ ప్రథమ ఫలితాల్లో 2.88 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్థ సాధించినట్లు మంత్రి సబిత వెల్లడించారు. మొత్తం 60.10 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. తొలి సంవత్సర ఫలితాల్లో బాలికలదే పైచేయి అని చెప్పారు. 67.4శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించగా, బాలురు 52.30 శాతం ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు.
రెండో సంవత్సర ఫలితాల్లో 2.83 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారని చెప్పారు. 71.15 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించగా, బాలుర ఉత్తీర్ణత శాతం 52.10గా నమోదైందని తెలిపారు.
ప్రథమ సంవత్సర ఫలితాల్లో 75 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా అగ్రస్థానంలో నిలవగా, రెండో సంవత్సరం ఫలితాల్లో 76 శాతం ఉత్తీర్ణతతో కొమురంభీమ్ జిల్లా తొలి స్థానంలో నిలిచిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. అభివృద్ధిలో వెనుకబడి ఉంటుందనే పేరున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచి ఫలితాలు రావడం సంతోషదాయకమన్నారు.
పరీక్షలు పాస్ అయిన విద్యార్థులు తదుపరి ఏం చదవాలనే ఒత్తిడితో ఉంటే.. ఫెయిలైన విద్యార్థులు మరో రకం ఒత్తిడిలో ఉంటారని, వీరికి తల్లిదండ్రులు మద్దతుగా నిలవాలని సూచించారు. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని సీఎం కేసీఆర్ చెప్పారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. త్వరలోనే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ప్రకటిస్తామని మంత్రి చెప్పారు.