సమగ్ర సాగు సమాచారం సేకరిస్తున్న అధికారులు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, June 12, 2020

సమగ్ర సాగు సమాచారం సేకరిస్తున్న అధికారులు

వానకాలం సాగుకు పంట పెట్టుబడిని ప్రభుత్వం సిద్ధంచేసింది. రైతుబంధు కోసం ఆర్థికశాఖ ఇప్పటికే వ్యవసాయశాఖ ఖాతాలో రూ.5 వేల కోట్లు జమచేసింది. క్షేత్రస్థాయిలో సమగ్ర పంటల సాగు వివరాల సేకరణ పూర్తికాగానే ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. భూముల క్రయవిక్రయాలు పూర్తయి మ్యుటేషన్‌ పొంది కొత్త పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు వచ్చిన రైతులకు కూడా ఈ వానకాలంలో రైతుబంధు సాయం ఇవ్వనున్నారు. ఈ ఏడాది జనవరి 30 వరకు కొత్త పాస్‌పుస్తకాలు వచ్చినవారికి ఈ డబ్బులు అందనున్నాయి. భూరికార్డుల ప్రక్షాళనలో ‘బీ’ క్యాటగిరీలోని భూముల సమస్యలు కూడా పరిష్కారం కావడంతో వారు కూడా రైతుబంధు పరిధిలోకి వచ్చారు. దీంతో రైతుబంధు లబ్ధిదారులు 52 లక్షల నుంచి దాదాపు 60 లక్షలకు పెరిగారు. అదనంగా పెరిగిన రైతులకు కూడా పంటసాయం అందించేందుకు ప్రభుత్వం రైతుబంధు నిధులను కూడా పెంచింది. వ్యవసాయశాఖకు తాజాగా విడుదల చేసిన రూ.5 వేల కోట్లకు అదనంగా మరో రూ. 2వేల కోట్ల నిధులు కూడా అందించనున్నది. రాష్ట్రంలో డిమాండ్‌కు అనుగుణంగా పంటల సాగు చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం.. సమగ్ర సాగు విధానానికి రూపకల్పన చేసింది. రాష్ట్రంలో సూచించిన మేరకు, సూచించిన పంటలనే సాగుచేయాలని పేర్కొన్నది. ఈ వానకాలం సీజన్‌ నుంచే దీనిని అమలుచేయడానికి నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయఅధికారులు క్లస్టర్లవారీగా రైతులతో మాట్లాడి ఏ భూమిలో ఏ పంటలు వేయాల్లో వివరిస్తున్నారు. రైతులు కూడా నియంత్రిత పంటల సాగువిధానానికి ముందుకొస్తున్న నేపథ్యంలో త్వరలో ఎకరాలవారీగా, రైతులవారీగా పంటల సాగుపై పూర్తి లెక్కలు వెల్లడికానున్నాయి. దీనిఆధారంగా వ్యవసాయశాఖ రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నది. ఈ నెలాఖరు లేదా జూలై 15వ తేదీలోపు రైతుల ఖాతాల్లోకి పంటసాయం సొమ్ము రానున్నట్టు సమాచారం. గ్రామాల్లో రైతువేదిక నిర్మాణానికి ప్రభుత్వం రూ.300 కోట్లు విడుదల చేసింది.