నియామకాల్లో తెలంగాణ రికార్డు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, June 06, 2020

నియామకాల్లో తెలంగాణ రికార్డు

నీళ్లు, నిధులు, నియామకాలు నినాదాల పునాదులపై ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని రూపుమాపేందుకు లక్షా 7వేల ఉద్యోగాలు భర్తీచేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలిశాసనసభా సమావేశాల్లోనే ప్రకటించారు. ఈ ఆరేండ్లలో అందుకనుగుణంగానే కార్యాచరణ జరిగింది. ఇప్పటివరకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ), ఇతర రిక్రూట్‌మెంట్‌ బోర్డుల ద్వారా దాదాపు లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయడంతోపాటు, భర్తీ ప్రక్రియను కూడా విజయవంతంగా పూర్తిచేశారు. ఇందులో టీఎస్‌పీఎస్సీ నుంచి భర్తీ అయినవే 30వేల పోస్టుల దాకా ఉన్నాయి. కోర్టు కేసులు, ఇతర అవరోధాలను అధిగమించి భర్తీ ప్రక్రియను చేపట్టిన టీఎస్‌పీఎస్సీ ఇతర రాష్ర్టాల్లో పీఎస్సీలకు మార్గదర్శకంగా నిలిచింది. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ప్రముఖ రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ప్రభుత్వం గతంలో ఎన్నడూ రిక్రూట్‌ చేయని పోస్టులను సైతం భర్తీచేసింది.

ఉమ్మడిరాష్ట్రంలో తీవ్ర వివక్షకు గురైన తెలంగాణలో ఉద్యోగాల కల్పనపై అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధరంగాలకు సంబంధించి దాదాపు లక్ష ఉద్యోగాల భర్తీకి వివిధ దశల్లో ఆర్థికశాఖ అనుమతులు కూడా ఇచ్చింది. ఇందులో టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సినవి 40 వేలు ఉన్నాయి. 2014 డిసెంబర్‌ 18న నూతనంగా ఏర్పడిన టీఎస్‌పీఎస్సీకి ఇది సవాల్‌గా మారింది. కమిషన్‌ ఏర్పడగానే పని ప్రారంభం కాలేదు. సిలబస్‌ ఫ్రేమ్‌ చేసుకోవడం, సర్వీస్‌ రూల్స్‌ మార్చుకోవడం, స్టాఫ్‌ను సిద్ధం చేసుకొనేందుకు ఐదు నుంచి ఆరు నెలలు పట్టింది. అలా మొదటి నోటిఫికేషన్‌ 2015 ఆగస్టులో విడుదలైంది. అప్పట్నుంచి ఇప్పటివరకు మొత్తం 105 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. 36,643 ఖాళీలకుగాను 29,091 పోస్టులు భర్తీచేశారు. 5,916 పోస్టులకు సంబంధించి కోర్టులో స్టే ఉన్నది. మరో 1,636 పోస్టుల భర్తీ చివరి దశలో ఉన్నది.