ఐపీఎస్ అధికారిగా ఫెయిలయ్యాను.. పోలీస్ వ్యవస్థలో మార్పు రావాలి.. వీకే సింగ్ రాజీనామా.. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, June 25, 2020

ఐపీఎస్ అధికారిగా ఫెయిలయ్యాను.. పోలీస్ వ్యవస్థలో మార్పు రావాలి.. వీకే సింగ్ రాజీనామా..

'ఎన్నో ఆశలు, ఆశయాలతో పోలీస్ సర్వీసులో చేరాను. కానీ ఐఏఎస్ అధికారిగా నేను ఫెయిలయ్యాను. తెలంగాణ ప్రభుత్వం కూడా నా పని తీరుకు పెద్దగా ఇంప్రెస్ కాలేదు. వివాదాన్ని ఇంకా పెద్దది చేయడం ఇష్టంలేదు. బహుశా ఈ నా అభిప్రాయం కూడా విలువ లేనిదే అయిఉండొచ్చు. విలువలేని వ్యక్తుల్ని భరించాల్సిన అవసరం ప్రభుత్వానికి కూడా లేదేమో... '' అంటూ భావోద్వేగంతో కూడిన లేఖ ద్వారా తెలంగాణ సీనియర్ ఐపీఎస్ అధికారి వినొయ్ కుమార్ సింగ్(వీకే సింగ్) తన రాజీనామా ప్రకటించారు.
తెలంగాణ జైళ్ల శాఖ ఇన్ చార్జిగా పలు సంస్కరణలు చేపట్టి పాపులరైన వీకే సింగ్.. ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. 33 ఏళ్ల సర్వీసు ఉన్నప్పటికీ తనకు డీజీపీ స్థాయి ప్రమోషన్ ఎందుకు ఇవ్వలేదంటూ కేసీఆర్ సర్కారుపై విమర్శలు చేసిన ఆయన.. ప్రమోషన్ రాకుంటే రాజీనామా చేస్తానని గతంలోనే ప్రకటించిన మేరకు బుధవారం కేంద్ర హోం శాఖకు లేఖ పంపారు.
పోలీస్ వ్యవస్థలో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉందన్న వీకే సింగ్.. ఉద్యోగంలో ఉండి ఆ దిశగా పని చేయలేకపోతున్నానని, రిటైర్మెంట్ తర్వాత వ్యవస్థలో మార్పు కోసమే పని చేస్తానని పేర్కొన్నారు. 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సింగ్ సర్వీసు ఇంకా కొద్ది నెలలు ఉన్నప్పటికీ వాలంటరీగా రాజీనామా ప్రకటించడం గమనార్హం. సత్యం, న్యాయం అనే పదాలకు మారుపేరైన గాంధీజీ జయంతి(అక్టోబర్ 2న) తాను విధుల నుంచి పూర్తిగా వైదొలుగుతానని, రాజీనామా లేఖను మూడు నెలల నోటీస్ పిరియడ్ గానూ భావించాలని కేంద్రానికి ఆయన రిక్వెస్ట్ చేశారు. ఏ ప్రభుత్వం పట్లా తనకు వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు.