ఫాంహౌజ్‌ వివాదంలో హైకోర్టు ఉత్తర్వులు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, June 11, 2020

ఫాంహౌజ్‌ వివాదంలో హైకోర్టు ఉత్తర్వులు

రంగారెడ్డి జిల్లాలోని ఫాంహౌజ్‌ వివాదంలో జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. గండిపేటలోని జన్వాడ గ్రామ పరిధిలో ప్రైవేట్‌ వ్యక్తి ఐదేండ్ల క్రితం నిర్మించుకొన్న ఫాంహౌజ్‌పై కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ఎన్జీటీలో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఎన్జీటీ మంత్రి కేటీఆర్‌కు ఇచ్చిన నోటీసులపై హైకోర్టు స్పందించింది. ఫాంహౌజ్‌ తనది కాదని, దానితో ఎలాంటి సం బంధం లేదని మంత్రి కేటీఆర్‌ పిటిషన్‌ వేశారు. తనను పార్టీ చేయకుండా ఎన్జీటీ ఆదేశాలివ్వడాన్ని సవాల్‌చేస్తూ ఫాంహౌజ్‌ యజమాని బద్వేలు ప్రదీప్‌రెడ్డి మరో పిటిషన్‌ వేశారు. బుధవారం ఈ రెం డు పిటిషన్లను విచారించిన జస్టిస్‌ ఏ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ పీ నవీన్‌రావు ధర్మాసనం ఎన్జీటీ ఆదేశాలపై మధ్యంతర స్టే విధించింది. 

ఎన్జీటీ ఆదేశాల్లో పొరపాటు

ఎన్జీటీ చెన్నై బెంచ్‌ ఆదేశాల్లో పొరపాటు దొర్లిందని, ఎన్జీటీ యాక్ట్‌- 2010 సెక్షన్‌ 14 సబ్‌సెక్షన్‌ 3, సెక్షన్‌ 19 సబ్‌సెక్షన్‌ 1కి విరుద్ధంగా ఆదేశాలు ఉన్నాయని ధర్మాసనం ప్రాథమికంగా అభిప్రాయపడింది. జీవో 111కు విరుద్ధంగా నిర్మాణం జరిగిందని ఎన్జీటీ ముందు పిటిషన్‌ దాఖలైందని, జీవో 111 చట్టానికి అనుబంధంగా జారీచేసినది  కాదని తెలిపింది. ఈ విషయాన్ని ఎన్జీటీ పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నది.వివాదం(కాజ్‌ ఆఫ్‌ యాక్షన్‌) ఎప్పుడు ఏర్పడిందన్న విషయాన్ని సైతం పరిగణనలోకి తీసుకోలేదని అభిప్రాయపడింది. వివాదాస్పద ప్రైవేటు నిర్మాణం 2015లో జరిగిందని, ప్రతివాది రేవంత్‌రెడ్డి 2020, మే నెలలో ఎన్జీటీని ఆశ్రయించారని పేర్కొన్నది. ఇది ఎన్జీటీ యాక్ట్‌ 2010 సెక్షన 14 సబ్‌సెక్షన్‌ 3కు విరుద్ధమని తెలిపింది. కాజ్‌ ఆఫ్‌ యాక్షన్‌ అనేది ఆరునెలల్లోపు ఉంటేనే ఎన్జీటీ జోక్యంచేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని స్పష్టంచేసింది. ఈ మేరకు ఎన్జీటీ ఆదేశాలపై మధ్యంతర స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అసలు యజమానులు ఎవరు? ఆస్తి ఎవరి ఆధీనంలో ఉన్నదనే విషయా న్ని ఎన్జీటీ పరిగణనలోకి తీసుకోలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఫాంహౌజ్‌ మంత్రి కేటీఆర్‌కు సంబంధించినదని నిరూపించే పత్రాలేవీలేవనీ పేర్కొన్నది. ఆస్తి కేటీఆర్‌దేనని నిరూపణ కాకుండా ఎన్జీటీ ఆదేశాలు జారీచేసిందని వ్యాఖ్యానించింది.

రాజకీయ దురుద్దేశంతోనే పిటిషన్‌

విచారణ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఆ ఫాంహౌజ్‌తో మంత్రి కేటీఆర్‌కు సంబంధం లేదని అన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు ఆయన ప్రకటించినప్పటికీ, ఎంపీ రేవంత్‌రెడ్డి రాజకీయ శత్రుత్వంతో ఎన్జీటీని ఆశ్రయించారని పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలతో న్యాయ ప్రక్రియ దుర్వినియోగానికి  రేవంత్‌రెడ్డి ప్రయత్నించారని తెలిపారు. ఎన్జీటీ యాక్ట్‌-2010 సెక్షన్‌ 14 సబ్‌సెక్షన్‌ 3 ప్రకారం ఎన్జీటీ ఈ కేసులో జోక్యంచేసుకోవడానికి అవకాశం లేదన్నారు. జీవో 111కు విరుద్ధంగా నిర్మించారని పేర్కొంటున్న నిర్మాణం 2015లో జరిగిందని, ఎంపీ రేవంత్‌రెడ్డి 2020 మే నెలలో ఎన్జీటీని ఆశ్రయించారని తెలిపారు. ప్రాథమికంగా అసలు ఈ కేసు విచారణ ఎన్జీటీ పరిధిలోకి రాదని వెల్లడించారు. మరోవైపు  ఫాంహౌజ్‌ యజమాని బద్వేలు ప్రదీప్‌రెడ్డి  తరఫున సీనియర్‌ న్యాయవాది రఘురాం వాదనలు వినిపిస్తూ..అసలు యజమాని అయిన తమ క్లయింట్‌ను పార్టీగా చేర్చకుం డా ఎన్జీటీ ఆదేశాలు జారీచేసిందని పేర్కొన్నారు. ఆ స్థలానికి నిజమైన తామే యజమానులమన్నారు. 

కేటీఆర్‌కు ఏం సంబంధం?

రేవంత్‌రెడ్డి పేర్కొంటున్న ఫాంహౌజ్‌ తమదేనని సదరు ఆస్తి యజమాని బద్వేలు ప్రదీప్‌రెడ్డి తరఫున న్యాయవాది పేర్కొన్నారు. ఈ మేరకు తాము ఆస్తిని కొనుగోలు చేసినట్టు నిరూపించే సేల్‌ డీడ్‌ను హైకోర్టుకు సమర్పించారు. అసలు కేటీఆర్‌ ఎవరో తమకు తెలియదని, తమ స్వార్జితమైన ఆస్తిపై తమను సంప్రదించకుండా ముడో వ్యక్తికి ఎలా నోటీసులు ఇస్తారని ప్రశ్నించారు. తమ ఫాంహౌజ్‌ వివాదాన్ని పత్రికల్లో చదివి ఆశ్చర్యపోయామని తెలిపారు. కేటీఆర్‌ ఎవరో తమకు తెలియదని ధర్మాసనానికి వెల్లడించారు. ఎన్జీటీలో దాఖలు చేసిన పిటిషన్‌లో సర్వే నంబర్‌, ఓనర్‌షిప్‌ వంటి వివరాలు ఏవీ పేర్కొనలేదని వెల్లడించారు. దీంతో ఫాంహౌజ్‌కు కేటీఆర్‌కు ఏం సంబంధమని ధర్మాసనం ప్రతివాదులను ప్రశ్నించింది. 

ఫాంహౌజ్‌ నాది కాదు: మంత్రి కేటీఆర్‌

ప్రతివాది ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రత్యర్థి పార్టీకి చెందినవారని, సదరు పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిందని మంత్రి కేటీఆర్‌ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన అఫిడవిట్‌లో కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డిని మొదటి ప్రతివాదిగా చేర్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ, పొ ల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు, వాటర్‌బోర్డు, హెచ్‌ఎండీఏ, నీటిపారుదల శాఖ, హైదరాబాద్‌ చెరువులు, జలవనరుల నిర్వహణ సంస్థను ఇతర ప్రతివాదులుగా పేర్కొన్నారు. ప్రజావిశ్వాసాన్ని పొందలేకపోయిన రేవంత్‌రెడ్డి పదేపదే తమ పార్టీపై, ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. 
ఈ క్రమంలోనే జీవో 111 కు విరుద్ధంగా నిర్మాణం చేపట్టారంటూ ఎన్జీటీలో కేసు వేశారని తెలిపారు. ప్రైవేటు ప్రాపర్టీలో డ్రోన్‌ ఎగురవేసి రేవంత్‌ క్రిమినల్‌ చర్యలకు పాల్పడ్డారని, దీంతో నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైందని పేర్కొన్నారు. ఈ కేసులో రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చారని తెలిపారు. రేవంత్‌రెడ్డి పేర్కొంటున్న ఫాంహౌజ్‌ తనది కాదని పదే పదే చెప్తున్నానని, అలాంటప్పుడు తాను నిబంధనలు ఉల్లంఘించినట్టు ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. రాజకీయంగా కక్ష సాధించడానికి న్యాయప్రక్రియను అపహాస్యం చేసేలా కేసు వేశారని తెలిపారు. తాను నిర్మాణం చేపట్టానని అనడానికి ఒక్క ఆధారాన్ని సైతం సమర్పించలేదని పేర్కొన్నారు. ప్రైవేటు ప్రాపర్టీ యాజమాని ఎవరనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎన్జీటీ పిటిషన్‌ను స్వీకరించిందని తెలిపారు. 

Post Top Ad