త్వరలో రెండో హరిత విప్లవం - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, June 20, 2020

త్వరలో రెండో హరిత విప్లవం

తెలంగాణలో త్వరలో రెండో హరితవిప్లవం ఆవిష్కృతమవుతుందని మున్సిపల్‌, ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. కాళేశ్వరం జలాలు, నియంత్రిత పంటలసాగు విధానంతో త్వరలోనే ఇది సాకారం కానుందని చెప్పారు. నియంత్రిత పంటల సాగును విజయంతంచేసి తెలంగాణ దేశానికే ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. ఈ వానకాలం రైతుబంధు పథకం కింద కొత్తగా 8,567వేల మందికి, పంట పెట్టుబడి అందిస్తున్నట్టు తెలిపారు. ప్రతి రైతు ఖాతాల్లో డబ్బులు పడాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలను ప్రజాప్రతినిధులు, అధికారులు విజయవంతంగా అమలుచేయాలని కోరారు. దీనిని ప్రభుత్వం సవాల్‌ తీసుకుందని చెప్పారు. రైతుబంధు పథకంపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్‌ శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లాపరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో జలవిప్లవం ఆవిష్కృతమైందని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో దేశంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నవచరిత్రకు నాంది పలికారని కొనియాడారు. ప్రాజెక్టు నిర్మాణాలకు భూములిచ్చిన రైతులు, ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు. 

రైతుల క్షేమం కోసమే నియంత్రిత సాగు

రైతుల క్షేమాన్ని కాంక్షించే నియంత్రిత పంటలసాగుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రైతులంతా బాగుపడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయమని చెప్పారు. నియంత్రిత పంటల సాగుకు రైతుల నుంచి అపూర్వ స్పందన వస్తున్నదని, జిల్లాలో 40 శాతం సన్న రకాల సాగు లక్ష్యంగా నిర్ధేశించుకుందని తెలిపారు. రైతులను సంఘటితం చేసేందుకు రైతు వేదికలు నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఈ వేదికలకు టీ ఫైబర్‌ ద్వారా నెట్‌ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. 

హరితహారంలో భాగస్వాములు కావాలి 

ఈ నెల 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న ఆరో విడుత హరితహారంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని, జిల్లావ్యాప్తంగా లక్ష మొక్కలునాటి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపాలని కోరారు. సిరిసిల్ల పట్టణం సమీపంలోని పోతిరెడ్డిపల్లె ఫారెస్టుబ్లాక్‌లో 200 హెక్టార్లలో అర్బన్‌ లంగ్‌ఫారెస్ట్‌కు కార్యచరణ సిద్ధంచేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఆరు వేలమందికి కరోనా సోకిందని తెలిపారు. కరోనాకు అప్రమత్తతే ఆయుధమని, బతుకుతోపాటు బతుకుదెరువు ముఖ్యమేనన్నారు. రాష్ట్రంలో ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలను నిక్కచ్చిగా అమలుచేస్తున్నామని చెప్పారు. 

లక్ష్యాలను సాధించకపోతే వేటుతప్పదు

వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్‌వ్యాధులు ప్రబలకుండా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. గ్రామాలు, పట్టణాలు అపరిశుభ్రంగా ఉంటే కార్యదర్శులు, కమిషనర్లకు ఫిర్యాదుచేయాలని సూచించారు. ఉపాధిహామీ పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని యుద్ధప్రాతికన షెడ్ల నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దసరాకల్లా రైతువేదికల నిర్మాణాలు పూర్తిచేసి, అన్నింటికీ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాలని చెప్పారు. ఈజీఎస్‌లో కొత్త పంచాయతీ భవనాలు, శ్మశానవాటికల అభివృద్ధి చేపట్టాలన్నారు. మూడునెలల్లో అన్ని గ్రామాల్లో వడ్లు ఆరబెట్టుకునేందుకు కల్లాలు, పశువుల పాకల నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీలో భాగంగా పల్లెల ప్రగతి కోసం ప్రభుత్వం రూ. 40వేల కో ట్లు కేటాయించిందని, ఈ నిధులతో 70 రకాల పనులు చేపట్టవచ్చని సూచించారు. ఉపాధి హామీలో రాష్ర్టాన్ని దేశస్థాయిలో అగ్రభాగాన నిలుపాలన్నారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌, నర్సరీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనన్నారు. సామాన్యుడు కేంద్రంగా ప్రభుత్వ పాలన నడుస్తుందని, పరిపాలన విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను సాధించకపోతే అధికారులు, ప్రజాప్రతినిధులపై వేటుతప్పదని హెచ్చరించారు. జూలై 15కల్లా ప్రజాప్రతినిధులందరు గ్రామాల్లో పర్యటించి, ఏ భూమిలో ఏ పంట వేశారో తెలుసుకోవాలన్నారు. నాట్లు, కోత దశ నుంచి ధాన్యం మార్కెట్‌లో విక్రయించి ఆహారంగా మారే వరకు పక్కా ప్రణాళికతో ముందుకుపోవడమే నియంత్రిత సాగు ఉద్దేశమన్నారు. సమావేశంలో ఇంచార్జి కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి, అదనపు కలెక్టర్‌ అంజయ్య, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, వైస్‌చైర్మన్‌ సిద్ధం వేణు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అన్ని శాఖల అధికారులు తదితరు లు పాల్గొన్నారు.