ప్రజల ముందుకు పాలన..ప్రగతి పథంలో తెలంగాణ : మంత్రి కేటీఆర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, June 29, 2020

ప్రజల ముందుకు పాలన..ప్రగతి పథంలో తెలంగాణ : మంత్రి కేటీఆర్

జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్డీవో కార్యాలయాన్ని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, సహచర మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. హుజూర్ నగర్ పురపాలక సంఘం భవన కార్యాలయంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రులు మొక్కలు నాటారు. పురపాలక సంఘం పరిధిలో నూతనంగా నిర్మించ తలపెట్టిన అర్బన్ పార్క్ నిర్మాణంతో పాటు స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..పాలనను ప్రజల ముంగిటకు తెస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన సంస్కరణలకు తెరలేపారన్నారు. 
కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ లు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. నేడు సంక్షేమ ఫలాలు  ప్రజల ముంగిటకు వచ్చాయని తెలిపారు. చిట్ట చివరి మనిషి వరకు ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను అక్రమిస్తే ఉపేక్షించేది లేదని, వారిపట్ల కఠినంగానే ఉంటామని హెచ్చరించారు.
కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంత కష్ట కాలంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ 54 లక్షల 22 వేల రైతులకు రూ.7 వేల కోట్లను రైతుబంధు కింద ఆర్థిక చేయూత ఇచ్చారని వెల్లడించారు. అందరికి ఆసరా పెన్షన్లను, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు డబ్బులు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు.
హుజూర్ నగర్ లో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేశాం. యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. హైదరాబాద్ టు విజయవాడకు హై స్పీడ్ రైలు ఏర్పాటు చేసేలా ప్రయత్నం చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. పార్టీలకు అతీతంగా  తెలంగాణలో  అభివృద్ధి జరుగుతున్నదని, ఇప్పుడు ఎన్నికలు ఏమి లేవు. మా ముందున్న లక్ష్యం అభివృద్ధి మాత్రమే అన్నారు.