హెచ్‌సీయూకి పీవీ పేరు పెట్టండి - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, June 29, 2020

హెచ్‌సీయూకి పీవీ పేరు పెట్టండి

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి మాజీప్రధాని పీవీ నరసింహారావు పేరుపెట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పీవీ శతజయంతి సందర్భంగా ఇదే ఆయనకు ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. తెలంగాణలో జరిగిన ఆందోళనల ఫలితంగా నాడు తీసుకొచ్చిన ఆరుసూత్రాల పథకంలో భాగంగానే 1974లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీని స్థాపించారని.. ఈ విశ్వవిద్యాలయానికి తెలంగాణ గర్వించదగిన బిడ్డ మాజీ ప్రధాని పీవీ పేరుపెట్టాలని విజ్ఞప్తిచేశారు. 

ప్రధానికి సీఎం కేసీఆర్‌ రాసిన లేఖ పూర్తి పాఠం

భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 1921 జూన్‌ 28వ తేదీన తెలంగాణలో జన్మించారు. ఆదివారం నుంచి ఆయన శతజయంతి ఉత్సవాలను జరుపుకొంటున్నాం. 1991లో వచ్చిన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి స్థిరమైన ఆర్థికవ్యవస్థను ఏర్పాటుచేసి దేశాన్ని వృద్ధిపథంలోకి తీసుకెళ్లిన నాయకుడిగా పీవీ ప్రసిద్ధి చెందారు. అదే సమయంలో పీవీ బహుముఖ ప్రజ్ఞావంతుడైన భారతదేశపు బిడ్డ. అనేక ఇతర కీలకమైన రంగాల్లో దేశ అభివృద్ధికి ఆయన దోహదపడ్డారు. రాష్ట్రస్థాయిలో గురుకుల పాఠశాలలు, జాతీయస్థాయిలో నవోదయ పాఠశాలల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాలు, పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఉత్తమమైన విద్య అందింది. విద్యావిధానంలో ఇది విప్లవాత్మకమైన మార్పు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టాలని తెలంగాణ ప్రజల నుంచి బలమైన డిమాండ్‌ ఉన్నది. 1974లో అప్పుడు జరిగిన ఆందోళనల ఫలితంగా వచ్చిన ఆరుసూత్రాల పథకంలో భాగంగా (సిక్స్‌ పాయింట్‌ ఫార్ములా) తెలంగాణలో విద్యామౌలిక సదుపాయాల అసమతుల్యతను సరిచేయడానికి హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయం స్థాపించబడింది. ఈ యూనివర్సిటీకి పీవీ నరసింహారావు సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ అని పేరుపెట్టాలని మీ కార్యాలయం ద్వారా భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. పీవీ శతజయంతి ఉత్సవాలు జరుపుకొంటున్న సమయంలో ఇదే ఆయనకు ఘనమైన నివాళి.