బ్లాక్‌మెయిల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ రేవంత్‌ రెడ్డి: ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, June 07, 2020

బ్లాక్‌మెయిల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ రేవంత్‌ రెడ్డి: ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి

మంత్రి కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి చేసిన తప్పుడు ఆరోపణలను ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ఖండించారు. రేవంత్‌రెడ్డి తీరు దొంగే దొంగ అని అరుస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. ఆయన ఈ రోజు ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్‌, భానుప్రసాద్‌, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, సైదిరెడ్డితో కలిసి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. వట్టినాగులపల్లిలోని సర్వే నంబర్‌ 66లో రేవంత్‌రెడ్డి అక్రమ కట్టడాల వివరాలను బయటపెట్టామని, గోపన్‌పల్లిలో రేవంత్‌ రెడ్డి దళితుల భూములు కబ్జా చేశాడని బాల్క సుమన్‌ ఆరోపించారు. కేటీఆర్‌ ఆస్తుల వివరాలన్నీ పబ్లిక్‌ డొమైన్‌లోనే ఉన్నాయని చెప్పారు. రేవంత్‌రెడ్డి అక్రమ భాగోతాలన్నీ రానున్న రోజుల్లో బయటపెడతామని వెల్లడించారు.
మంత్రి కేటీఆర్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని, ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలిపారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ అన్నారు. న్యాయస్థానాలపట్ల తమకు గౌరవముందని చెప్పారు. రేవంత్‌ రెడ్డి లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటంపై కాంగ్రెస్‌ పార్టీ పునరాలోచించుకోవాలని సూచించారు. రేవంత్‌ రెడ్డి ఎన్నోసార్లు జైలుకు వెళ్లొచ్చారని విమర్శించారు. చాలామంది కాంగ్రెస్‌ నేతల ఫాంహౌజ్‌లన్నీ 111 జీవో పరిధిలోనే ఉన్నాయని ఆ పార్టీ నేత వీ హనుమంతరావు చెప్పారన్నారు. రేవంత్‌ రెడ్డి ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని వెల్లడించారు. 
క్రిమినల్‌ కేసులు జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తి.. బాధ్యత కలిగిన పదివిలో ఉన్న కేటీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండలిలో ప్రభుత్వ విప్‌ భానుప్రసాద్‌ విమర్శించారు. రేవంత్‌రెడ్డి చిల్లర రాజకీయాలు ఇక్కడ నడవవని అన్నారు. బ్లాక్‌మెయిల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ రేవంత్‌ రెడ్డి అని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. గోడల మీద పెయింట్లు వేసిన రేవంత్‌కి వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశంలో యూత్‌ ఐకాన్‌గా ప్రపంచం మెచ్చిన నాయకుడు కేటీఆర్‌ అని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్‌ గురించి మాట్లాడే అర్హత రేవంత్‌రెడ్డికి లేదని పేర్కొన్నారు. ప్రజలు కరోనా బాధపడుతుంటే కాంగ్రెస్‌ నేతలు అడ్రస్‌ లేకుండా పోయారని విమర్శించారు.

Post Top Ad