ప్రాజెక్టు నిర్వహణపై శాస్త్రీయ పర్యవేక్షణ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, June 08, 2020

ప్రాజెక్టు నిర్వహణపై శాస్త్రీయ పర్యవేక్షణ

ఒక ప్రాజెక్టు నిర్వహణ కోసం ప్రణాళిక అవసరం. అదే అనేకప్రాజెక్టుల సమాహారంగా రూపుదిద్దుకున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్వహణకు కేవలం ప్రణాళిక సరిపోదు. అందుకు భారీవ్యూహం కావాలి. అటు ప్రధాన గోదావరి.. ఇటు ప్రాణహిత.. నడుమ కడెం.. ఎప్పుడు వరద ఎక్కడి నుంచి వస్తుందో గుర్తించాలి. వర్షపాతం, వరద రాకను ముందే పసిగట్టాలి. రోజుకు 2-3 టీఎంసీల జలాలను ఎత్తిపోసే అనేకదశల్లో ఉన్న భారీమోటర్లను సక్రమంగా నిర్వహించాలి. ఎక్కడ ఏ చిన్న మార్పు జరిగినా అందుకనుగుణంగా వ్యవస్థ అంతటిలోనూ ఆ మేరకు మార్పు చేసేలా అప్రమత్తం కావాలి. 
సమాచారాన్ని ఒకేచోట కేంద్రీకృతం చేసి ఎప్పటికప్పుడు వ్యూహ రచనతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ చేపట్టాలి. ఈ వానకాలంలో రోజుకు మూడు టీఎంసీల చొప్పున ఎత్తిపోయాలని నిర్ణయించిన కాళేశ్వరం ప్రాజెక్టులో జలాలు కొండపోచమ్మసాగర్‌ వరకు తరలించనున్నారు. దీనిపై సీఎం కేసీఆర్‌ ముందుగానే అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణలో భాగంగా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొనేలా ఒక పకడ్బందీ సాంకేతిక వ్యవస్థతో ‘డ్యాష్‌బోర్డు’ను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఈ మేరకు ముగ్గురు ఈఎన్సీలతో ఏర్పాటైన కమిటీ ప్రస్తుతం ఆ ప్రక్రియలో నిమగ్నమైంది.


ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసే జలాలు ఎంతో విలువైనవి. డిమాండ్‌, కచ్చితంగా ఎత్తిపోయాల్సిన పరిస్థితుల్లోనే మోటర్లను నడపాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మ్యాప్‌ ఇప్పటికే జన బాహుళ్యంలో బాగా ప్రచారం పొందింది. ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న డ్యాష్‌బోర్డును ఆ మ్యాప్‌కు అనుగుణంగా తయారుచేస్తున్నట్టు సమాచారం. గోదావరి ఎక్కడ ఎంత పారుతుంది? ఏ పంపుహౌజ్‌ల్లో జలాలు ఎంతమేర ఎత్తిపోస్తున్నారు? అనే వివరాలను మ్యాపు రూపంలోనే పొందుపరచనున్నట్టు తెలిసింది. 


ఈ డ్యాష్‌బోర్డు వల్ల కేవలం నిర్ణయాలే కాకుండా ప్రాజెక్టు నిర్వహణ కూడా శాస్త్రీయంగా కొనసాగుతుంది. తద్వారా భారీ మోటర్లకు సాంకేతికంగా చిన్నసమస్య రాకుండా ముందుగానే అప్రమత్తమయ్యే అవకాశముంటుంది. ఎక్కడైనా చిన్న సాంకేతిక సమస్య తలెత్తినా, ఒక్కసారిగా ట్రిప్‌ అయినా, సర్జ్‌పూల్స్‌లో నీటిమట్టాలు ఒకేసారి పడిపోయినా వెంటనే అలారం (డ్యాష్‌బోర్డులో ఎర్ర కలర్‌ ఇండికేషన్‌) ద్వారా అప్రమత్తం చేస్తారు. వెంటనే మోటరును నిలిపివేసే అవకాశం ఉంటుంది. ఈ డ్యాష్‌బోర్డులో భాగంగా ప్రాజెక్టు పరిధిలోని ఏయే ప్రాంతాల్లో పంటల సాగు (క్రాప్‌ ప్యాటర్న్‌) ఎలా ఉందనే వివరాలు కూడా ముందుగానే నమోదై ఉంటాయి. తద్వారా ఆయా మార్గాల్లో ఎంత నీటి అవసరాలు ఉంటాయనేదానిపై అంచనా ఉంటుంది.

Post Top Ad