ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటాలి - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, June 20, 2020

ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటాలి

ములుగు అడవిని  ఏరియల్ వ్యూలో చూసినప్పుడు చాలావరకు చెట్లు లేకపోవడం తనకు బాధ కలిగించిందని, ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ పేర్కొన్నారు. ములుగు జిల్లా కలెక్టరేట్‌లో జిల్లాలోని పనులను ఉపాధి హామీ పథకం కింద చేపట్టడం, హరితహారంపై శనివారం ఆమె కలెక్టర్‌, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ, అటవీ జిల్లాగా పేరొందిన ములుగులో అడవులను సంరక్షించుకోవాలని సూచించారు. ఖాళీ ప్రదేశాలను దట్టమైన అడవిగా మార్చేలా హరితహారంలో బ్లాక్ ప్లాంటేషన్ చేయాలన్నారు.  అడవులను పెంచి మంచి వాతావరణం కల్పించడమే భావితరాలకు మనమిచ్చే గొప్ప కానుక అని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యానికి మించి మొక్కలు నాటి, సంరక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే,   ఉపాధిహామీ పథకం కింద ప్రతి ఒక్కరికీ రూ. 222 ఇవ్వడం సంతోషకరమన్నారు. ఉపాధిహామీ పథకంలో భాగంగా  చెరువుల్లో పూడికతీత, పాత కాలువల మరమ్మతులు పూర్తిచేయాలని ఆదేశించారు. రైతుబంధు అందరికీ వచ్చేలా చూడాలని కలెక్టర్‌కు సూచించారు.  ఒక కమిటీ వేసి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు.  గోదావరి నది పారుతున్న ఈ ప్రాంతంలో ప్రతి ఎకరాకు నీరందేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. పది రోజుల్లో హారితహారం, ఉపాధి హామీ పథకం, మేడారంలో జరుగుతున్న పనులపై మరో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. 
ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ, పోడు భూముల సమస్య పరిష్కారానికి  సమన్వయ కమిటీ వేయాలని విజ్ఞప్తి చేశారు.  జడ్పీ చైర్మన్‌ జగదీశ్‌ మాట్లాడుతూ, హరితహారంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని అధికారులను కోరారు.  అలాగే, ఏ గ్రామంలో రోడ్లు అవసరమున్నా ప్రతిపాదనలు పంపాలని కోరారు. ప్రతి గ్రామానికి అవసరమున్న నిర్మాణాల ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని, గ్రామంలో ఏమి కావాలో గ్రామసభ ద్వారా ద్తీర్మానం చేసి పంపించాలని కలెక్టర్ కృష్ణ పేర్కొన్నారు. ఏటూరు నాగారం  ఐటీడీఏ పరిధిలో రూ. 462 కోట్ల ప్రతిపాదనలు చేశామని, ములుగు జిల్లాకు రూ. 267 కోట్లు ప్రతిపాదించినట్లు చెప్పారు. అలాగే, హరితహారంలో భాగంగా
ప్రతి ప్రభుత్వ స్థలంలో అవెన్యూ ప్లాంటేషన్ చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా, సమావేశానికి ముందు కలెక్టర్ కార్యాలయంలో మంత్రి మొక్క నాటారు.  ఇక్కడ ఏటూరు నాగారం ఐటీడీఏ పీవో హన్మంతు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.