పోలీస్ శాఖలో అత్యంత వివాదాస్పదుడుగా పేరు తెచ్చుకొన్న రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్ బదిలీ అయ్యారు. ఆయన్ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఆదేశించింది. వీకే సింగ్ స్థానంలో రాష్ట్ర పోలీసు నియామకాల బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాస్‌రావుకు అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదివారం ఆదేశాలు జారీచేశారు.
ఆదినుంచీ అంతే!
సీనియర్ ఐపీఎస్ అధికారి వీకే సింగ్ నిత్యం ఏదో ఒక వివాదంతో, సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారని పోలీసువర్గాలే విమర్శిస్తున్నాయి. ఏ ప్రభుత్వమున్నా వ్యతిరేకించడం.. తన అధికార పరిధిని మించి సొంత ఎజెండాతో సెల్ఫ్ స్టయిల్‌గా పనిచేస్తుంటారని ఆయన సహచర ఉద్యోగులు విమర్శిస్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొనే వీకే ను బదిలీ చేసినట్లు అధికారవర్గాలు భావిస్తున్నాయి. వీకేసీంగ్ నిత్య అసంతృప్తవాది అని, తనకు వీఆర్ఎస్ ఇవ్వాలని కూడా ఇటీవల కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నారని ఆయన సహచరులు చెప్తున్నారు. తన ‘మార్క్' చేష్టలతో ఎవరికీ అంతుపట్టని ధోరణితో ఉంటారంటున్నారు. తానొక్కడే సమర్థుడని.. మిగిలిన వారంతా తక్కువవారన్నట్టుగా వ్యవహరిస్తారని పోలీసువర్గాలే విస్తుపోతున్నాయి. ఒక సివిల్ అధికారి స్థాయికి సరిపడని రీతిలో ఆయన వ్యవహారశైలి ఉంటుందని ఆరోపిస్తున్నారు.
అతనికి ప్రచార కండూతి ఎక్కువని, దానితోనే వ్యవస్థలో లోపాలున్నాయంటూ గగ్గోలు పెడుతుంటారని పేర్కొంటున్నాయి. మూడు దశాబ్దాలకు పైగా పోలీస్ ఉన్నతాధికారిగా పనిచేసిన వీకే సింగ్ ఒకానొక సందర్భంలో ‘పోలీస్ వ్యవస్థతో ప్రజలకు ఒరిగేదేమీలేదు’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని సివిల్ సర్వీస్ అధికారులు విమర్శిస్తున్నారు. ఆయన నవంబర్‌లో పదవీవిరమణ చేయాల్సి ఉండగా, అక్టోబర్‌లో రిటైర్మెంట్ కోరుతూ దరఖాస్తుచేశారని, నెలముం దు పదవీ విరమణ కోరుతున్న ఆయన ఎన్నో ఏండ్ల సర్వీసును వదులుకొంటున్నట్లుగా తెగ హడావుడి చేస్తున్నారంటున్నారు. రోజుకో పత్రికా ప్రకటనతో తనకేదో పోలీసు వ్యవస్థలో అన్యాయం జరిగిందని లేఖలు రాయడం విడ్డూరమని, రిటైర్మెంట్ నుంచి కూడా ప్రచార లబ్ధి పొందాలని తాపత్రయపడుతున్నట్లు పోలీసువర్గాలే పేర్కొంటున్నాయి.
జైళ్లశాఖ డీజీగా లెక్కలేనన్ని వివాదాలు
వీకేసింగ్ తెలంగాణ జైళ్లశాఖ డీజీగా సుదీర్ఘకాలం పనిచేసిన సమయంలో పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రధానంగా చర్లపల్లి జైలునుంచి టేకు కలపను బీహార్‌లోని పాట్నాకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని ఓ టీవీ చానల్ కథనాన్ని ప్రసారంచేయడం అప్పట్లో కలకలం రేపింది. ఆ టీవీ చానల్‌పై వీకేసింగ్.. తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. నిరాధార ఆరోపణలని, ఆ టీవీ చానల్ ‘కమర్షియల్ సెక్స్ వర్కర్' అంటూ తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. దీనిపై జర్నలిస్టులు సైతం నిరసన వ్యక్తంచేశారు. వీకే సింగ్ బహిరంగ క్షమాపణ చెప్పేవరకు జైళ్లశాఖ వార్తలను కవర్ చేసేది లేదనేవరకు పరిస్థితి వెళ్లడం అప్పట్లో తమకు తలనొప్పిగా మారిందని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు.