అవసరమైతే మళ్లీ లాక్ డౌన్... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, June 29, 2020

అవసరమైతే మళ్లీ లాక్ డౌన్...

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత సోమవారం(జూన్ 22) నుంచి శనివారం(జూన్ 27) వరకూ నమోదైన కేసులను పరిశీలిస్తే.. ప్రతీరోజూ వెయ్యికి దగ్గరగా కేసులు నమోదయ్యాయి. సోమవారం 872,మంగళవారం 879,బుధవారం 891,గురువారం 920, శుక్రవారం 985, శనివారం 1080 కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధిక కేసులో జీహెచ్ఎంసీ పరిధిలోనివే. ఇలా కేసుల సంఖ్య పైకి ఎగబాకుతుండటంతో హైదరాబాద్ వాసుల్లో భయాందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ ఆలోచన చేస్తోంది.
హైదరాబాద్‌లో కేసుల తీవ్రత రీత్యా 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించాలని వైద్య, ఆరోగ్య శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. వీటిని పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. రెండు,మూడు రోజుల్లో పరిస్థితిని సమీక్షించి అవసరమైతే లాక్ డౌన్ ప్రకటిద్దామని ఆయన అధికారులతో అభిప్రాయపడినట్టు సమాచారం. అయితే లాక్ డౌన్‌కి ముందు అధికార యంత్రాంగాన్ని సన్నద్దం చేయాల్సి ఉంటుందని... ఆ తర్వాతే లాక్ డౌన్ విధించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అన్ని మెట్రో నగరాల్లో మాదిరే హైదరాబాద్‌లోనూ కేసుల సంఖ్య పెరుగుతోందని కేసీఆర్ పేర్కొనట్లు తెలుస్తోంది. చెన్నై లాంటి నగరాల్లో మోసారి లాక్ డౌన్ విధించిన విషయాన్ని ఆయన ప్రస్తావించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మరో 2,3రోజుల్లో కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి జీహెచ్ఎంసీ పరిధిలో లాక్ డౌన్‌పై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈసారి మరింత కఠిన ఆంక్షలతో లాక్ డౌన్ అమలుచేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.