నా కొడుకు దేశం కోసం చనిపోవడం గర్వంగా ఉంది.. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 17, 2020

నా కొడుకు దేశం కోసం చనిపోవడం గర్వంగా ఉంది..

భారత్ - చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో రెండు దేశాలకు మధ్య జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు చనిపోయారు. ఆయనతోపాటు మరో ఇద్దరు జవాన్లు కూడా నేలకొరిగారు. కల్నల్ మరణంతో ఆయన స్వస్థలమైన సూర్యాపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే సంతోష్ దేశం కోసం ప్రాణత్యాగం చేయడం గర్వకారణంగా ఉందని వారంతా చెప్పారు.
సూర్యాపేట విద్యానగర్‌కు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు గడిచిన 15 ఏళ్లుగా ఆర్మీలో పనిచేస్తున్నారు. 16-బిహార్ రెజిమెంట్‌ కమాండర్ హోదాలో గత ఏడాదిన్నరగా ఆయన చైనా సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నారు. సంతోష్‌కు భార్య సంతోషి, కూతురు అభిజ్ఞ(9), కొడుకు అనిల్(6) ఉన్నారు. తండ్రి ఉపేందర్ రిటైర్డ్ బ్యాంక్ అధికారికాగా, తల్లి మంజుల గృహిణి. సంతోష్ చనిపోయే సమయానికి ఆయన భార్య సంతోషి ఢిల్లీలోనే ఉన్నారు.
‘‘నాకు ఒక్కడే కొడుకు. దేశం కోసం పోరాడుతూ అమరుడు కావడం చాలా గర్వంగా ఉంది. కానీ ఒక తల్లిగా.. కొడుకును పోగొట్టుకున్నందుకు బాధగానూ ఉంది. సంతోష్ చనిపోయినట్లు ఆర్మీ అధికారుల నుంచి సమాచారం వచ్చిన వెంటనే.. మా కోడలు(సంతోషిణి) ఫోన్ చేసి మాకు విషయం చెప్పింది. నిజానికి ఆదివారం రాత్రే వాడు మాతో మాట్లాడాడు. ఆరోగ్యాన్ని కాపాడుకోమని చెప్పాడు..''అంటూ కన్నీటిపర్యంతమయ్యారు కల్నల్ సంతోష్ మాతృమూర్తి మంజుల.