రైతన్న సన్నద్ధం.. సర్కారు సమాయత్తం - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 16, 2020

రైతన్న సన్నద్ధం.. సర్కారు సమాయత్తం

రాష్ట్రంలో రైతులు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు నియంత్రిత పద్ధతిలోనే పంటల సాగుకు అంగీకరించి, దాని ప్రకారం విత్తనాలు వేసుకోవడానికి సిద్ధంకావడంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తంచేశారు. మార్కెట్లో డిమాండ్‌ కలిగిన పంటలనే వేయడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు విధానం ప్రతిపాదించిందన్నారు. ఇందుకు రైతుల నుంచి వందకు వందశాతం మద్దతు లభించిందని సీఎం చెప్పారు. రైతాంగం నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు సిద్ధమైనందున వెంటనే రైతుబంధు సాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. 
రాష్ట్రంలో నియంత్రిత పంటలసాగు విధానం అమలు, రైతుబంధు పథకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఇప్పటికే వ్యయసాయ పనులు ప్రారంభమయ్యాయయని, ఏ ఒక్క రైతు కూడా పెట్టుబడి డబ్బులకోసం ఇబ్బంది పడవద్దని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. ఒక్క ఎకరా కూడా మిగులకుండా.. ఒక్క రైతును వదులకుండా అందరికీ వారం పదిరోజుల్లోగా రైతుబంధు సాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమచేయాలన్నారు. రైతుబంధు డబ్బులను సరిగ్గా వినియోగించుకొని వ్యవసాయ పనులను ముమ్మరంగా కొనసాగించాలని రైతులకు పిలుపునిచ్చారు. వానకాలం పంటలకోసం ప్రణాళిక రూపొందించినట్లుగానే, యాసంగి పంటలకోసం కూడా వ్యవసాయ ప్రణాళిక తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. 

యాసంగి పంటలకు సాగు ప్రణాళిక

యాసంగికి కూడా సమగ్రమైన వ్యవసాయ ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. యాసంగిలో ఏయే పంటలు సాగుచేయాలనే విషయంలో రైతులకు మార్గదర్శకంచేయడంతోపాటు, ఆ పంటకు సంబంధించిన విత్తనాలు కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. ‘గత యాసంగిలో 53.5 లక్షల ఎకరాల్లో పంటసాగు జరిగింది. ఈసారి ప్రాజెక్టుల ద్వారా వచ్చే సాగునీటితోపాటు, మంచి వానలు కూడా కురిసే అవకాశం ఉన్నందున మరో 10-12 లక్షల ఎకరాల సాగు పెరిగే అవకాశం ఉంటుంది. వానకాలంలో వద్దని చెప్పిన మక్కలు యాసంగిలో సాగుచేసుకోవాలి. 45 లక్షల ఎకరాల్లో వరి, ఆరేడు లక్షల ఎకరాల్లో మక్కలు, నాలుగు లక్షల ఎకరాల్లో శనగలు, ఐదు లక్షల ఎకరాల్లో వేరుశనగ (పల్లి), లక్షన్నర ఎకరాల్లో కూరగాయలు సాగుచేసుకొనేలా ప్రణాళిక సిద్ధంచేయాలి. దీనికి సంబంధించిన విత్తనాలు కూడా అందుబాటులోకి తేవాలి. 
వరిలో సన్న, దొడ్డు రకాలను కూడా రైతులకు సూచించాలి. ఇతర పంటలకు సంబంధించిన విత్తనాలు మార్కెట్లో లభ్యమవుతాయి. వేరుశనగ, శనగ విత్తనాలను వ్యవసాయశాఖ సిద్ధంచేయాలి. నియంత్రిత పంటల సాగు విధానం అంటే ఇదే. ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకొని, దానికి అనుగుణమైన ఏర్పాట్లను ముందుగానే చేసుకోవడం’ అని సీఎం కేసీఆర్‌ అధికారులకు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి ఎస్‌ నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్‌కుమార్‌, సీడ్‌ కార్పొరేషన్‌ ఎండీ కేశవులు, వ్యవసాయశాఖ ఉపసంచాలకులు విజయ్‌కుమార్‌, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్‌ నర్సింగ్‌రావు పాల్గొన్నారు.