చిక్కితే నేరుగా కోర్టుకే.. జైలు శిక్ష కూడా! - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, June 08, 2020

చిక్కితే నేరుగా కోర్టుకే.. జైలు శిక్ష కూడా!

కరోనా లాక్‌డౌన్‌లో వరుసగా సడలింపులు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. కొన్ని నియమాలను మాత్రం కఠినంగా నిర్వర్తించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ప్రజాభద్రతను దృష్టిలో పెట్టుకుని సైబరాబాద్‌ పోలీసులు ట్రాఫిక్‌ నియమాలను కఠినంగా అమలు చేస్తున్నారు. 
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే మైనర్లు, యువకులను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. స్నేహితులు, బంధువుల కార్లు, బైక్‌లను తీసుకుని రహదారులపై దూసుకెళ్తూ ఇతరుల వాహనాలను ఢీకొట్టే వారిని కట్టడి చేయడం.. ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 5వేల 156 వితవుట్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కేసులు, 425 మైనర్‌ డ్రైవింగ్‌ కేసులు నమోదు చేశారు అధికారులు. 
అలాగే ఒకే బైక్‌పై ముగ్గురి ప్రయాణించడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసే వారిని పట్టుకునేందుకు ఊహించని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులను పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. లైసెన్స్‌ లేకుండా బండి నడిపే వారిని ఆపి అక్కడికక్కడే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. మైనర్లు అయితే తల్లిదండ్రులను పిలిపించి వారితో మరోసారి వాహనాలను నడపనీయమంటూ లిఖితపూర్వకంగా రాయించుకుని వాహనాలు ఇస్తున్నారు. ఇలా 425 మైనర్‌ డ్రైవింగ్‌ కేసులు నమోదుచేశారు. మేజర్లయితే కోర్టులో హాజరు పరుస్తున్నారు. లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్నామంటూ దరఖాస్తు నంబరు చూపిస్తేనే వాహనాన్ని తిరిగి ఇస్తున్నారు. 
ఇక ద్విచక్ర వాహనం, కార్లు, ఇతర వాహనాలు నడిపేందుకు అవసరమైన డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా నడిపితే నేరుగా న్యాయస్థానానికి వెళ్లాల్సిందే. గతంలో లైసెన్స్‌ లేకుండా  నడిపితే పోలీసులు జరిమానా విధించి వదిలేసేవారు. లైసెన్సు లేకుండా తొలిసారి పోలీసులకు చిక్కితే.. వాహనం స్వాధీనం చేసుకుంటారు. తర్వాతి రోజు న్యాయస్థానంలో వాహనదారుడిపై చార్జిషీట్‌ దాఖలు చేస్తారు. కోర్టు సమయం పూర్తయ్యేవరకూ కోర్టు ప్రాంగణంలోనే నిలబడి ఉండాలి. జరిమానా చెల్లించాలి. రెండోసారి పోలీసులకు దొరికితే.. 48 గంటలపాటు జైలులో పెడుతారు.

Post Top Ad