అంతా త‌ప్పుడు ప్రచారం..క‌రోనాపై పోరుకు స‌ర్వం సిద్దం : తెలంగాణ వైద్య నిపుణులు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 09, 2020

అంతా త‌ప్పుడు ప్రచారం..క‌రోనాపై పోరుకు స‌ర్వం సిద్దం : తెలంగాణ వైద్య నిపుణులు

కరోనా వైరస్ సోకిన వారికి ట్రీట్మెంట్ అందించడానికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు, పరికరాలు సిద్ధంగా ఉన్నాయని, ఎంతమందికైనా చికిత్స చేసే సామర్థ్యం ప్రభుత్వ ఆసుపత్రులకు ఉందని రాష్ట్ర వైద్యశాఖ అధికారులు, నిపుణులు స్పష్టం చేశారు. ఈ విషయంలో కొన్ని మీడియా సంస్థలు, కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేసి, ప్రజలను గందరగోళ పరుస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రచారం వెనుక కుట్ర ఉందని కూడా వారు అనుమానం వ్యక్తం చేశారు.
2వేల మందికి పైగా చికిత్స అందించగలిగే సామర్ధ్యం కలిగిన గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం 247 మంది మాత్రమే కోవిడ్ వైరస్ సోకిన వారున్నారని వారు స్పష్టం చేశారు. వాస్తవం ఇదైతే కొంత మంది పని గట్టుకుని గాంధి ఆసుపత్రి కోవిడ్ పేషంట్లతో కిక్కిరిసిపోయిందని ప్రచారం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు నిరంతరం పిల్స్ వేయడం వల్ల రోజూ కోర్టుకు తిరగాల్సి వస్తున్నదని, దీనివల్ల తాము వైద్యసేవలు అందించడంలో ఇబ్బంది కలుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ కారణంతో మరణించినా సరే, వారందరికీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలనే హైకోర్టు ఆదేశం అమలుకు సాధ్యం కాదని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని వారు అభ్యర్థించారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, నివారణ చర్యలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజెందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, కమిషనర్ యోగితా రాణా, డిఎంఇ రమేశ్ రెడ్డి, డిఎంహెచ్ శ్రీనివాస్, కోవిడ్ నిపుణుల కమిటి సభ్యుడు గంగాధర్, హెల్త్ యూనివర్సిటీ విసి కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కరోనా విషయంలో వాస్తవ పరిస్థితికి, కొన్ని మీడియా చానల్స్ లో జరుగుతున్న ప్రచారానికి ఏమాత్రం పొంతన లేదని ఈ సందర్భంగా వైద్యాధికారులు, నిపుణులు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తెచ్చారు. కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల ప్రజలు అనవసర ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. వారు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చిన అంశాలు ఈ విధంగా ఉన్నాయి.
-గాంధీ ఆసుపత్రి కరోనా పేషంట్లతో కిక్కిరిసిపోతున్నదని కొందరు ప్రచారం చేస్తున్నారు. కొన్ని పేపర్లు, టీవీలలో కూడా అలాగే చెపుతున్నారు. కానీ ఇది పూర్తిగా అబద్ధం. గాంధి ఆసుపత్రిలో 2150 మందికి చికిత్స అందించే అవకాశం ఉంది. ఇందులో వెయ్యి ఆక్సిజన్ సౌకర్యం కలిగిన బెడ్లు ఉన్నాయి. ప్రస్తుతం గాంధి ఆసుపత్రిలో కేవలం 247 మంది కరోనా పేషంట్లు మాత్రమే ఉన్నారు. గాంధిలో ఉన్న సౌకర్యాలనే పూర్తిగా వాడుకునే అవసరం ఇంత వరకు రాలేదు. వైరస్ సోకిన వారిలో చాలా మంది కోలుకుని డిశ్చార్జి అయి, ఇంటికెళ్లారు. ఎలాంటి లక్షణాలు లేని వారికి హోమ్ ట్రీట్మెంట్ అందిస్తున్నాము.

Post Top Ad