పంజాగుట్ట స్టీల్ వంతెన ప్రారంభం: ట్రాఫిక్ సమస్యలకు ఇక చెక్ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, June 20, 2020

పంజాగుట్ట స్టీల్ వంతెన ప్రారంభం: ట్రాఫిక్ సమస్యలకు ఇక చెక్

నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను తీర్చేందుకు మరో వంతెన సిద్ధమైంది. పంజాగుట్టలో నూతనంగా నిర్మించిన ఉక్కు(స్టీల్) వంతెనను శుక్రవారం డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ.. నగరంలో ట్రాఫిక్ సమస్యను తొలగించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతోందని అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ వంతెన నిర్మాణ పనులు లాక్‌డౌన్ సమయంలోనూ కొనసాగించినట్లు హోంమంత్రి మహూద్ అలీ తెలిపారు.
కాగా, రూ. 6 కోట్లతో బల్దియా నిధులతో పంజాగుట్ట స్మశాన వాటిక వద్ద ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఈ వంతెనపై నేటి నుంచే రాకపోకలు సాగనుండటంతో జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మార్గంలో ట్రాఫిక్ సమస్య తీరనుంది. ఈ వంతెన నిర్మాణం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ కార్గో సేవలు
తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలను ప్రారంభించింది. ఆర్టీసీకి అదనపు ఆదాయం కలిగించేందుకు పార్సిల్, కార్గో, కొరియర్ సేవలను ప్రారంభించినట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ వెల్లడించారు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో కార్గో సేవలను .మంత్రి శుక్రవారం ప్రారంభించారు.
తొలి విడతగా 140 బస్టాండ్లలో కార్గో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని పువ్వాడ అజయ్ తెలిపారు. గతంలో ప్రైవేటు సంస్థల ద్వారా కార్గో, పార్సిల్ సేవలు నడిచేవని.. ప్రస్తుతం ఆ టెండర్లు రద్దు చేశామన్నారు. త్వరలో కార్గో సేవలకు సంబంధించి మొబైల్ యాప్ కూడా తీసుకొస్తామని మంత్రి పువ్వాడ అజయ్ వివరించారు.