వందే భారత్ మిషన్ కు మరిన్ని విమానాలు : కిషన్ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, June 13, 2020

వందే భారత్ మిషన్ కు మరిన్ని విమానాలు : కిషన్ రెడ్డి

క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా వివిధ దేశాల్లో చిక్కుకున్నవారికోసం వందేభారత్‌ మిషన్‌ కింద మరిన్ని విమానాలను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి వెల్ల‌డించారు. సింగపూర్‌ తెలుగు సమాజం విజ్ఞప్తి మేరకు మలి విడతలో కూడా నెలాఖరు వరకు మరిన్ని విమానాలను కూడా సమకూర్చేందుకు ప్రయత్నిస్తామన్నామ‌ని చెప్పారు. అత్యవసరాలు ఉన్నవారికి సింగపూర్‌ తెలుగు సమాజం స్వయంగా చార్టెడ్‌ విమానం ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు. క‌రోనా ప్రభావంతో సింగపూర్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగువారి సమస్యలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి, సింగపూర్‌ తెలుగు సమాజం కార్యవర్గంతో జూమ్‌యాప్ ద్వారా చర్చించారు.
ఈ సందర్భంగా సింగపూర్‌లో చిక్కుకున్న తెలుగు వారితో పాటు అనేక రాష్ట్రాలవారి కోసం అదనపు విమానాలను ఏర్పాటు చేయడంలో కృషిచేసినందుకు కిషన్‌ రెడ్డికి సింగపూర్‌ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ, కోవిడ్‌-19 నివారణలో భాగంగా భారతదేశంలో ఉన్న పరిస్థితులను, భారత ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను వివరించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్‌ కార్పోరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఏవియేషన్‌ సలహాదారులు భరత్‌ రెడ్డి, కపిల్‌ ఏరో ఇండియా లిమిటెడ్‌ వ్యవస్ధాపకులు చిన్నబాబు పాల్గొన్నారు. సింగపూర్‌ తెలుగు సమాజం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం ఈనెల 17న హైదరాబాద్‌ బయలుదేరుతుందని తెలిపారు.