మన శాస్త్రవేత్తలు ప్రతిభావంతులు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 30, 2020

మన శాస్త్రవేత్తలు ప్రతిభావంతులు

భారతీయ శాస్త్రవేత్తల్లో అపార ప్రతిభ దాగున్నదని.. అయితే ప్రోత్సాహం లేకపోవడంతో పోటీతత్వం కొరవడిందని హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ పేర్కొన్నారు. అందువల్లనే మనం పరిశోధనల్లో వెనుకబడిపోతున్నామని చెప్పారు. శాస్త్రపరమైన ప్రతి ప్రాజెక్టుకు నిర్దేశిత గడువు విధించి.. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తే కొత్త ఆవిష్కరణలకు అవకాశం ఉంటుందన్నారు. విశ్వం బల్లపరుపుగా ఉందని.. అది వేగంగా విస్తరిస్తున్నదని సిద్ధార్థ్‌ రెండున్నర దశాబ్దాల కిందటే ప్రతిపాదించారు. అప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కొంతకాలం తర్వాత అదే అంశంపై పరిశోధనలు చేసిన అమెరికన్‌ శాస్త్రవేత్తలను నోబెల్‌ బహుమతి వరించింది. ఇందుకు గల కారణాలతోపాటు అనేక అంశాలను ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

భారతీయ శాస్త్రవేత్తలపై వివక్ష ఉంది 

భారత్‌లో ఉండి పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలపై చిన్నచూపు ఉన్నది. విదేశాల్లో ఉండి పరిశోధనలు చేసేవారికి నోబెల్‌ బహుమతులు వస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. మనవాళ్లు కొత్త అంశాలపై పెద్దగా దృష్టిపెట్టడం లేదు. ఇతరులు చేసిన పరిశోధనలను కొనసాగిస్తున్నాం. మిగతా దేశాల కన్నా ముందే.. మన ప్రాచీను లు ఖగోళ శాస్త్రంలో అనేక పరిశోధనలు చేశారు. అయితే వాటిని ప్రపంచానికి పరిచయం చేయడంలో, వాటిని కొనసాగిస్తూ మరింత లోతుగా అధ్యయనం చేయడంలో మనం వెనుకబడ్డాం. 1600 ఏండ్లపాటు మనం పరాయి పాలనలో ఉండటం కూడా ఇందుకు కారణం కావచ్చు. ప్రభుత్వాల విధానాలు, అవినీతి వంటివి కూడా ప్రభావితం చేస్తున్నాయి. 

పరిశోధనలకు గడువు విధించాలి

మన శాస్త్రవేత్తల్లో అపార ప్రతిభ ఉంది. అయితే.. ఫలితాలు మాత్రం పెద్దగా రావడం లేదు. ప్రోత్సాహం లేకపోవడంతో పోటీతత్వం లోపిస్తున్నది. గగన్‌యాన్‌, చంద్రయాన్‌ మాదిరిగా అన్ని పరిశోధనలకు కూడా నిర్దేశిత గదువు విధిస్తే కొన్ని ఫలితాలు కనిపించవచ్చు. అంతేకాకుండా.. ప్రైవేటురంగంలోని శాస్త్రవేత్తలకు ప్రభుత్వం ప్రోత్సాహమివ్వాలి. 

నోబెల్‌ మిస్సయిందనే బాధ లేదు 

విశ్వం బల్లపరుపుగా ఉన్నదని.. వేగంగా విస్తరిస్తున్నదని 26 ఏండ్ల కిందటే ప్రతిపాదించాను. అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత ఇదే అంశంపై పరిశోధనలు చేసిన ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్‌ వచ్చింది. ఇందుకు నాకేం పెద్దగా బాధలేదు. సైన్స్‌ ఎప్పుడూ ఆధారాలు, ఫలితాలనే చూస్తుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైనప్పుడు ఉష్ణోగ్రతలు పెరిగితే వైరస్‌ చనిపోతుందని అందరూ అన్నారు. అయితే యూవీ కిరణాలు మాత్రమే వైరస్‌ను చంపేస్తాయని నాలుగు నెలల కిందటే నేను చెప్పాను. ఇప్పుడు అదే నిజమైంది.