అచ్చం దిష్టిబొమ్మల్లా మంత్రులు: కేసుల లెక్కల్లో తేడా: కేసీఆర్‌ సర్కార్‌పై బండి సంజయ్ గుస్సా.. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, June 25, 2020

అచ్చం దిష్టిబొమ్మల్లా మంత్రులు: కేసుల లెక్కల్లో తేడా: కేసీఆర్‌ సర్కార్‌పై బండి సంజయ్ గుస్సా..

తెలంగాణ మంత్రులపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఫైరయ్యారు. వారు దిష్టిబొమ్మల్లా తయారయ్యారని మండిపడ్డారు. రహదారులు మంజూరు చేయని ఆర్ అండ్ బీ మంత్రి, హోంగార్డును బదిలీ చేయని హోంమంత్రి, కొత్త బస్ శాంక్షన్ చేయని ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్, పనుల కోసం నిధులు మంజూరు చేయని ఫైనాస్స్ మినిస్టర్.. అచ్చం బొమ్మల్లాగే ఉన్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో పనులు జరగడం లేదు అని అడిగితే.. తమపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బండి సంజయ్ గురువారం వేములవాడ పట్టణంలో 16, 26 వార్డులో పర్యటించారు. సీసీ రోడ్, డ్రైనేజీ కోసం భూమి పూజ చేసి.. తర్వాత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంత్రుల తీరు తనదైనశైలిలో విరుచుకుపడ్డారు.
కరోనా వైరస్ పాజిటివ్ కేసులకు సంబంధించి హెల్త్ బులెటిన్, అధికారులు చెబుతున్న లెక్కలకు పొంతన లేదని చెప్పారు. పాజిటివ్ కేసుల సంఖ్యలో తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. కరోనా పరీక్షలు చేయని కేసీఆర్ ప్రభుత్వం తమపై విమర్శలు చేయడం సరికాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న టెస్టుల వివరాల డేటాను చదివారు. ఉత్తరప్రదేశ్‌లో 5 లక్షలు, గుజరాత్, మధ్యప్రదేశ్ 3 లక్షల చొప్పున మందికి కరోనా పరీక్షలు చేశామని పేర్కొన్నారు.
కరోనా వైరస్ వల్ల ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆత్మనిర్భర్ నిధులు కేటాయిస్తే.. సీఎం కేసీఆర్ తప్పుపట్టడం సరికాదని బండి సంజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు పక్కదారి పట్టకుండా నేరుగా వినియోగదారులకే చేరుతున్నాయని చెప్పారు. దీనిని సీఎం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. అందుకే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.