తొలకరి జల్లుల ఆగమనంతో జ్యేష్ఠ పూర్ణిమనాడు రైతులు ఆనందోత్సాహాల మధ్య ఏరువాక పండుగను జరుపుకుంటారు. అరక దున్నటంతో పొలం పనులు మొదలుపెడతారు. రైతులు ఉదయమే ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెల గంటలతో అలంకరించి సాగుకు సన్నద్ధమవుతారు.
జిల్లాలోని బషీరాబాద్ మండలం, నవల్గ, జీవన్గి గ్రామాల్లో ఏరువాక సంబురాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరవగా ఎడ్ల బండి ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. మంత్రి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పశువులకు పూజలు చేసి రైతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అందంగా అలంకరించిన ఎడ్ల బండి పై మంత్రి ప్రయాణించి ఉత్సాహపరిచారు.