సీఎం జగన్‌ను హైదరాబాద్‌లో తిరగనివ్వం.. - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, June 05, 2020

సీఎం జగన్‌ను హైదరాబాద్‌లో తిరగనివ్వం..

ఓయూ జేఏసీ, దక్షిణ తెలంగాణ జేఏసీ నేతలు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. తెలంగాణ నీళ్లను ఏపీ సీఎం జగన్ దోచుకుంటున్నారని జేఏసీ నేతలు కల్వకుర్తి ఆంజనేయులు, మాళిగ లింగుస్వామిలు ఆరోపించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును ఆపకపోతే జగన్‌ను హైదరాబాద్‌లో తిరగనివ్వబోమని తేల్చిచెప్పారు. జేఏసీ తరపున వీరు శుక్రవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ పరమేశంను కలిసి వినతి పత్రం అందించారు. పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన 203 జీవోను రద్దు చేసుకోవాలని జగన్ ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేతలు తేల్చి చెప్పారు. జీవో 203 వల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే అవకాశముందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు, గోదావరి నీటిని ఉత్తర తెలంగాణకు, కృష్ణా నీటిని రాయలసీమకు తరలించుకుపోతే మరి దక్షిణ తెలంగాణ పరిస్థితి ఏంటని జేఏసీ నేతలు ప్రశ్నించారు. కేసీఆర్ ఇప్పటికైనా దక్షిణ తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రా? లేదా ఉత్తర తెలంగాణకు ముఖ్యమంత్రా? అని ప్రశ్నించారు. దక్షిణ తెలంగాణ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి తొత్తులుగా పని చేస్తున్నారని ఆరోపించారు.