కాంగ్రెస్‌కు హస్తం గుర్తు ఎంపికలో పీవీ తెలివి భళా! ఆసక్తికర ఘటన - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, June 28, 2020

కాంగ్రెస్‌కు హస్తం గుర్తు ఎంపికలో పీవీ తెలివి భళా! ఆసక్తికర ఘటన

కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల గుర్తు ఎంపిక చేసేటప్పుడు ఏర్పడ్డ గందరగోళానికి పీవీ నరసింహరావు తెరదింపారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ గుర్తు ‘ఆవు, దూడ’ను ఎన్నికల కమిషన్ నిలిపివేయడంతో రెండుగా చీలిపోయిన ఇందిర వర్గానికి (కాంగ్రెస్-ఐ) కొత్త గుర్తు ఎంచుకోమని ఎన్నికల సంఘం సూచించింది. కాంగ్రెస్ రెండుగా చీలినప్పుడు పీవీ ఇందిరకే మద్దతు పలికారు. ఆ సమయంలో ఇందిరాగాంధీ పీవీ నరసింహారావుతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. గుర్తు ఎంచుకోమని ఎన్నికల సంఘం అప్పటి కాంగ్రెస్-ఐలోని ముఖ్య నాయకుడు బూటా సింగ్‌కు మూడు ఐచ్ఛికాలు సూచించింది.
ఆ మూడు గుర్తులు.. ఏనుగు, సైకిల్, హస్తం. అందులో హస్తం అయితే బాగుంటుందని తొలుత బూటా సింగ్ భావించారు. ఇదే విషయాన్ని ఏపీలో ఉన్న ఇందిరకు చెబుతామనుకున్నారు. ఇందుకోసం అప్పట్లో బూటాసింగ్ ఇందిరాగాంధీకి ట్రంక్ కాల్ చేశారు. కానీ లైన్లలో అంతరాయం కారణంగా మాటలు సరిగ్గా వినిపించడం లేదు. బూటాసింగ్, ఇందిర మధ్య సంభాషణ గందరగోళంగా ఉంది.

బూటాసింగ్ హాత్(చేతి గుర్తు) అని చెబుతుంటే.. ఇందిరకు హాథీ(ఏనుగు) అన్నట్లుగా వినపడింది. దాంతో ఆమె ఆ గుర్తును నిరాకరించారు. ఆ సంగతి గమనించిన బూటా సింగ్ హాథీ కాదు.. హాత్ అని వివరిస్తున్నా ఫోన్ లైన్లలో అంతరాయం కారణంగా ఇందిరకు ఏమీ అర్థం కాలేదు. ఇక పక్కనే ఉన్న పీవీకి ఫోన్ రిసీవర్ అందించారు. దాదాపు 17 భాషలపై పట్టు ఉన్న పీవీకి విషయం అర్థమైంది. బూటాసింగ్ చెబుతున్నది అర్థం చేసుకున్న ఆయన హాథీ, హాత్ అనే పదాల వల్ల గందరగోళం ఏర్పడుతుందని గ్రహించారు. వెంటనే బూటా సింగ్‌కు ఓ ఉపాయం సూచించారు. ‘‘బూటా సింగ్‌ గారూ పంజా (చేయి) అని చెప్పండి’’ అని పీవీ సూచించారు. ఇందిర వెంటనే రిసీవర్ అందుకుని ఆ గుర్తు బాగుంటుందని, దాన్నే ఓకే చేయాలని ఖరారు చేశారు.

  • ఇలా కాంగ్రెస్-ఐకి హస్తం గుర్తు వచ్చిన తీరును ప్రముఖ జర్నలిస్టు, రచయిత అయిన రషీద్ కిడ్వాయి తాను రచించిన ‘24 అక్బర్ రోడ్’ పుస్తకంలో పేర్కొన్నారు. అయితే, హస్తం గుర్తు ఖరారయ్యాక ఆ గుర్తు చాలా మంది నేతలకు నచ్చలేదు. ట్రాఫిక్ పోలీస్‌ చేతిని చూపించినట్లుగా ఉందన్న విమర్శలు వచ్చాయి. కానీ ఇందిర అవేం పట్టించుకోలేదని ఆ పుస్తకంలో ప్రస్తావించారు. ఎందుకంటే అంతకుముందు ఉన్న కాంగ్రెస్‌కు ఉన్న ‘ఆవు, దూడ’ గుర్తును కొంత మంది ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీలతో పోల్చుతూ ట్రోల్ చేసేవారు.