నమ్మిన బాటలో నడిచిన..జాతి రత్నం - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, June 29, 2020

నమ్మిన బాటలో నడిచిన..జాతి రత్నం

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుది 360 డిగ్రీల వ్యక్తిత్వమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. పీవీ మన తెలంగాణ ఠీవి అని, ఆయనో నిరంతర సంస్కరణశీలి అని కొనియాడారు. నమ్మిన వాదానికి కట్టుబడి.. తన వ్యక్తిత్వాన్ని, విజ్ఞానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకొని ఎదిగిన ధీశాలి అని ప్రశంసించారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో ఆదివారం పీవీ శతజయంతి ఉత్సవాలను సీఎం ప్రారంభించారు. ఏడాది పొడుగునా పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ముందుగా సీఎం కేసీఆర్‌ పీవీ సమాధి వద్దకు వెళ్లి పుష్పాంజలి ఘటించారు. 
అనంతరం కొవిడ్‌ నిబంధనల ప్రకారం జరిగిన సభలో మాట్లాడుతూ.. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఇందుకోసం అసెంబ్లీలో, రాష్ట్ర క్యాబినెట్‌లో తీర్మానం చేసి తానే స్వయంగా ప్రధాని వద్దకు వెళ్లి కోరుతానని తెలిపారు. పార్లమెంట్‌లో పీవీ చిత్రపటం పెట్టాలని చెప్పారు. రాష్ట్రంలో పీవీతో అనుబంధం ఉన్న ఐదు ప్రదేశాల్లో ఆయన కాంస్య విగ్రహాలు ఆవిష్కరిస్తామని తెలిపారు. శాసనసభలో కూడా పీవీ భారీ చిత్రపటాన్ని ఏర్పాటుచేయాలని స్పీకర్‌ను కోరారు. పీవీ ఏ పదవిలో, ఏ స్థాయిలో ఉన్నా సంస్కరణలే లక్ష్యంగా పనిచేసే వారని అన్నారు. రాష్ట్రంలో సీఎం హోదాలో భూ సంస్కరణలకు శ్రీకారం చుట్టి.. ముందు తన భూమినే పేదలకు పంచిన నిజాయితీపరుడని తెలిపారు. అందుకే పీవీ మన తెలంగాణ ఠీవీ అని పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డకు ఒక ప్రధానిగా దక్కాల్సిన గౌరవం దక్కలేదని, అందుకే ఆ గౌరవం కల్పించేలా శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 
ఇంకా సీఎం మాట్లాడుతూ... ‘పీవీ నరసింహారావు గురించి ఇదీ అదీ అని చెప్పడానికి సాహసం కావాలి. పీవీ గురించి ఒక్క మాటలో చెప్పాలటే 360 డిగ్రీల పర్సనాలిటీ ఆయనది. అద్భుతమైన వ్యక్తిత్వం ఆయన సొంతం. ఆయన వ్యక్తిత్వ పటిమ.. ఆయనకు ఆయనే సృష్టించుకున్న గరిమ. ఆయన గురించి వర్ణించడానికి మాటలు చాలవు. ప్రస్తుతం పీవీ శతజయంతి ఉత్సవాలు చేయడం, ఇంత ప్రాధాన్యం అవసరమా? అనే సందేహాలు వచ్చాయి. ఉత్సవాలు అవసరమే. నిన్నటి గతమే నేటి చరిత్ర. ఒక గొప్ప తెలంగాణ బిడ్డ.. ప్రపంచానికే సేవ చేసిన వ్యక్తిని గుర్తు చేసుకోవాలి. ఆయన గురించి ప్రపంచానికి తెలియజేయాలి. అందుకే ఈ ఉత్సవాలు. ఈ రోజు నాకు చాలా ఉల్లాసంగా సంతోషంగా ఉన్నది.