జెట్టు స్పీడుతో వైరస్.. అయోమయంలో తెలంగాణ యంత్రాంగం.. - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, June 14, 2020

జెట్టు స్పీడుతో వైరస్.. అయోమయంలో తెలంగాణ యంత్రాంగం..

తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా వైరస్ కమ్మేస్తోంది. సాధారణ పౌరుల్లా కాకుండా పటిష్టమైన భద్రత మధ్య ఎంచుకున్న ప్రదేశాల్లో మాత్రమే సంచరించే ప్రజాప్రతినిధులకు కరోనా వైరస్ సోకుతుందంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అందుకు తగ్గట్టే తెలంగాణలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుండడంతో ప్రభుత్వ యంత్రాంగం కూడా గందరగోళంలో పడినట్టు తెలుస్తోంది. మళ్లీ లాక్‌డౌన్ ఆంక్షలు విధించి యావత్ ప్రజానికాన్ని ఇళ్లకే పరిమితం చేస్తే దాని ప్రభావం ఆర్థిక రంగం మీద పడుతుందని ప్రభుత్వం వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
సామాన్యులనే కాకుండా నిత్యం జాగ్రత్తలు తీసుకునే ప్రజా ప్రతినిధుల వరకూ కరోనా పాకుతుందంటే తీవ్రత ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణలో కరోనా ఎంత తీవ్రంగా విస్తరిస్తుందో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సోకిన పాజిటివ్ కేసులే నిర్ధారిస్తున్నాయి. సరైన చికిత్స తీసుకుందామనుకున్నా, ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్దామన్నా నాయకులు జంకుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కాగా మహారాష్ట్రలో ఏకంగా ముగ్గురు మంత్రులకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయినట్టుగానే తెలంగాణలో కూడా వైరస్ విజృంభిస్తుందా అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు.
ఎవరైనా ఎక్కడైనా అప్రమత్తంగా వ్యవహరించకుంటే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదన్నట్లుగా మాయదారి వైరస్ ఇప్పటికే పలువురిని కాటేసింది. సామాన్యుడు, రాజకీయ నాయకుడు, సెలబ్రిటీ, సినిమా హీరో అనే తారతమ్యం లేకుండా ఎవరినైనా సరే ఇట్టే అంటేసే ఈ మహమ్మారి తాజాగా తెలంగాణ రాష్ట్ర అధికారపార్టీకి చెందిన పలువురు నేతల సిబ్బందితో పాటు ఓ ఎమ్మెల్యేకి సోకింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమైనట్టు తెలుస్తోంది. వైరస్ మరింతగా వ్యాపించకుండా ఉండేందుకు కట్టుదిట్టంగా వ్యవహరించేందుకు సన్నాహాలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.