కల్నల్ సంతోష్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం: సీఎం కేసీఆర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 17, 2020

కల్నల్ సంతోష్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం: సీఎం కేసీఆర్

భారత్ - చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణత్యాగం చేశారన్నారు. ఆయన త్యాగం వెలకట్టలేనిదని అన్నారు.
సంతోష్ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కేసీఆర్ తెలిపారు. సంతోష్ మృతదేహాన్ని రిసీవ్ చేసుకోవడం నుంచి అంత్యక్రియల వరకు ప్రతి కార్యక్రమంలోనూ తెలంగాణ ప్రభుత్వం ప్రతినిధిగా పాల్గొనాలని మంత్రి జగదీష్ రెడ్డిని సీఎం ఆదేశించారు.
కాగా, సంతోష్ బాబు మృతిపై ఆయన తల్లి మంజుల స్పందించారు. తన కుమారుడు సంతోష్ బాబు దేశం కోసం పోరాడి అమరుడైనందుకు సంతోషంగా ఉందన్నారు. అయితే, తల్లిగా తనకు ఎంతో బాధగా ఉందన్నారు. ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడంటూ కన్నీటిపర్యంతమయ్యారు.
భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో మృతి చెందిన ముగ్గురు సైనికుల్లో సంతోష్ బాబు కూడా ఉన్నారు. సూర్యాపేటకు చెందిన సంతోష్ బాబుకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్(4) ఉన్నారు.
కాగా, కల్నల్ సంతోష్ బాబు మృతదేహాన్ని లదాక్ నుంచి హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిసింది. బుధవారం ఉదయం నాటికి ఆయన పార్థివదేహం హైదరాబాద్ కు చేరుతుందని, అక్కణ్నుంచి రోడ్డు మార్గంలో సూర్యాపేటకు తరలిస్తారని, బుధవారం మధ్యాహ్నమే సూర్యాపేటలో అధికారిక లాంఛనాలతో కల్నల్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.